ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ( ఏప్రిల్ 10, 2026 ) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను ప్రధాని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మోదీ.. ప్రోటోకాల్స్ పక్కనబెట్టి నేరుగా పవన్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ క్రేజీ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మా పిల్లలతో అలా..
ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అన్నా లెజినోవా తన మనసులోని మాటను ఇలా పంచుకున్నారు. మా ఇంటికి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం మాకు దక్కిన గొప్ప గౌరవం. మా కుటుంబం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణమిది. ఈ కలయికలో నన్ను బాగా ఆకట్టుకున్నది ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యత మాత్రమే కాదు.. మోదీ చూపించిన ఆప్యాయత, ఆత్మీయత. ఆయన మా పిల్లలందరితో ఎంతో ప్రేమగా మాట్లాడారు. వారి ఆసక్తులు ఏంటి? వారికి ఏం ఇష్టం? భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి నిజమైన శ్రద్ధను చూడటం చాలా అరుదు అని పోస్ట్ చేశారు.
ప్రధానికి అన్నా ప్రామిస్!
ఈ భేటీలో పవన్ ఆరోగ్యానికి మోదీ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో చెబుతూ అన్నా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పవన్ ముందుగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలని, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి విధుల్లోకి చేరాలని మోదీ సూచించారు. అంతేకాదు, నన్ను చూసి చిరునవ్వుతో.. ‘మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు. దానికి నేను కూడా చాలా సంతోషంగా .. తప్పకుండా చూసుకుంటాను అని ప్రధానికి ప్రామిస్ చేశాను . ఈ పర్యటనలో ఎంతో మానవీయ కోణం కనిపించింది. రోజంతా ముగిసినా.. గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే క్షణాల్లో ఇదొకటి అంటూ తన అభిప్రాయన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
క్రేజీ బాండ్..
కేవలం ఇదొక పరామర్శే అయినప్పటికీ, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ ఎంతటి విలువ ఇస్తున్నారో ఈ భేటీతో మరోసారి స్పష్టమైంది. పవన్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలతో మోదీ అంత సమయం కేటాయించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అన్నా లెజినోవా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పవన్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు, జనసేన సైనికులు క్రేజీ కామెంట్లతో పండగ చేసుకుంటున్నారు.
