తెలుగు భక్తి సాహిత్య ఖ్యాతిని ప్రపంచానికి చాటే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో అంతర్జాతీయంగా పేరొందిన గాత్ర సంగీత బృందం ‘చాంటిక్లీర్’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ సంకీర్తనను ఆలపించింది. అన్నమయ్య తన రచనల్లో భక్తితో పాటు మానవతా విలువలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనలో మనుషుల మధ్య ఎలాంటి భేదాలు లేవని, అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ తత్వమని అద్భుతంగా వివరించారు.
స్విట్జర్లాండ్‌లో సోల్స్‌బర్గ్ ఫెస్టివల్లో ప్రముఖ గాయకుడు చాంటిక్లీర్ బృందం మన తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన "బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే" పాట పాడారు 😍🙏 ఒక విదేశీయులు నుండి మన తెలుగు కీర్తన రావడం అనేది 🔥🔥 https://t.co/jNmXgk0NPH
— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) November 28, 2026
కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా మానవులందరూ సమానమేననే గొప్ప ఆలోచనను అత్యంత సరళమైన పదాల్లో ఆవిష్కరించారు. శతాబ్దాలు గడిచినా ఈ కీర్తనలోని అంతరార్థం నేటికీ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. అలాంటి గొప్ప రచనను విదేశీ గాయకులు అంతర్జాతీయ సంగీత వేదికపై ఆలపించడం తెలుగు వారందరికీ గర్వకారణం. భాషా సరిహద్దులను దాటి అన్నమయ్య ఆలోచనలు విశ్వవ్యాప్తం కావడానికి ఈ ప్రదర్శన మరో నిదర్శనంగా నిలిచింది.
15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య రచించిన ఈ కీర్తనలో మానవులందరూ సమానమేనని, కులమతాలు, ధనిక పేద తారతమ్యాలకు అతీతంగా భగవంతుడు ఒక్కడేనని చాటిచెప్పారు. దాదాపు ఆరు శతాబ్దాల క్రితం రచించిన ఈ కీర్తన నేటికీ ప్రాభవం కోల్పోకపోవడం విశేషం. తెలుగు భాష, సంస్కృతి తెలియని విదేశీ గాయకులు కూడా.. ఈ కీర్తన అర్థం, పరమార్థం తెలుసుకుని అంతర్జాతీయ వేదికపై ఆలపించడం తెలుగు సాహిత్య వైభవానికి నిదర్శనం. అన్నమయ్య ఆధ్యాత్మిక భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు ఇదొక చక్కని ఉదాహరణ.
