- స్టేట్లో 11 లక్షల మంది ఎంబీసీలు
హైదరాబాద్, వెలుగు: మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) లిస్ట్ లో మరో 14 కులాలు యాడ్ కానున్నాయి. ఈ కులాల లిస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రానికి పంపనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 50 సంచార జాతుల కులాలు ఉన్నట్టు నోటిఫై చేయనుంది. ప్రస్తుతం ఎంబీసీల లిస్ట్ లో 36 ఉండగా.. అదనంగా 14 కులాలు యాడ్ కానున్నాయి.
ఈ 14 కులాల్లో దాసరి (బెగ్గరి), జంగం, పంబాల, వాల్మికి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, కునపులి, రాజానాల, బుక్క అయ్యావారాస్, సిద్దుల, సిక్లింగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు వాళ్లు కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఎంబీసీ లిస్ట్ లో చేర్చాలని ఆయా కులాల నుంచి వచ్చిన ప్రపోజల్స్ ను పరిశీలించి ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఇటీవల లేఖ రాసింది.
ఎంబీసీలకు డీఎన్టీ (డీ నోటిఫైడ్ ట్రైబల్) పేరుతో కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లను మంజూరు చేయనుంది. రాష్ట్రంలో ఎంబీసీలు 11 లక్షల మంది ఉన్నట్టు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేలో వెల్లడయిందని బీసీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంబీసీల్లో ఉన్న జనాభాలో సగం కంటే ఎక్కువగా వడ్డెర, బోయ కులాల ప్రజలే ఉన్నారని చెబుతున్నారు. మిగతా కులాల ప్రజలు సైతం మెరుగైన జీవితం గడిపేలా వాళ్లకు స్కీమ్‌లు అందాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎంబీసీలకు పలు స్కీమ్‌లు
దేశ వ్యాప్తంగా ఉన్న ఎంబీసీలకు స్కీమ్ ఫర్ ఎకానమిక్ ఎంపవర్ మెంట్ ఆఫ్ డీఎన్టీస్ (సీడ్) స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పలు ప్రయో జనాలను కల్పించనుంది. ఇందులో హెల్త్, హౌసింగ్, ఎడ్యుకేషన్, ఆర్థిక సాయం, బతుకు దెరువు కోసం సాయం చేయనున్నారు. ఇందు కు ఎంబీసీల లిస్ట్ పంపాలని కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డీనోటిఫైడ్, నోమడిక్, సెమీ నోమడిక్, కమ్యూనిటీ (డీడ బ్ల్యూబీడీఎన్ సీ) బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో త్వరలో ఈ 14 కులాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది.
