మరో 24 మంది కార్యదర్శులపై వేటు

మరో 24 మంది కార్యదర్శులపై వేటు
  •  తాము 2 గంటలకే వచ్చి వేచి చూస్తున్నామన్న కార్యదర్శులు
  •  మీటింగ్​ హాల్​ బయటే ఉన్నా చర్యలు తీసుకున్నారని ఆవేదన
  •  మంత్రి  చెప్పినా వెనక్కి తగ్గని కలెక్టర్
  •  వారంలోగా 50 శాతం హరితహారం పూర్తి చేయాలని కండిషన్
  •  వరుస సెలవులతో టార్గెట్ ఎలా పూర్తిచేయాలంటున్న కార్యదర్శులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 24 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది. హరితహారం కార్యక్రమంపై తాను ఏర్పాటు చేసిన సమావేశానికి రాలేదంటూ 19 మంది జూనియర్ కార్యదర్శులు, ఐదుగురు సీనియర్ కార్యదర్శులను మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. మంత్రి ఫోన్ చేసి చెప్పినా వినని కలెక్టర్.. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు పలు కండిషన్లు పెట్టారు. రెండు రోజుల కిందట జరిగిందీ ఘటన. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో ఇద్దరు కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేయగా, మంచిర్యాల జిల్లాల్లో మూడు రోజుల్లో వంద శాతం టాయిలెట్స్ నిర్మాణం పూర్తి కాకుంటే సస్పెండ్ చేస్తామని నోటీసులు పంపారు.

అసలేం జరిగిందంటే..

హరితహారం, జలశక్తి అభియాన్ కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ రోనాల్డ్ రాస్.. మహబూబ్ నగర్ లోని అంబేద్కర్ కళాభవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. కార్యదర్శుల్లో కొందరు గర్భిణులు కూడా ఉన్నారు. అయితే కలెక్టర్ రావటం ఆలస్యమైంది. సమావేశం ఏర్పాటు చేసిన దగ్గర కనీసం టాయిలెట్స్ కూడా లేవు. దీంతో అందరూ ఇబ్బంది పడ్డారు. దీంతో కొందరు బయట నిలబడ్డారు. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటలకు వచ్చిన కలెక్టర్.. రాగానే డోర్లు మూసివేసి హాజరు తీసుకున్నారు. బయట ఉన్న వాళ్లను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. డీపీవోకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగా, ఆయన ఎంపీడీవోలకు ఉత్తర్వులు పంపారు.

మంత్రి చెప్పినా వినలే

సస్పెన్షన్లపై పంచాయతీ కార్యదర్శులు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణరావుతో కలిసి వెళ్లి జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ కు మంత్రి ఫోన్ చేసి సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే ఇందుకు కలెక్టర్ పలు కండీషన్లు పెట్టినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. మొక్కలు నాటేందుకు ఇచ్చిన టార్గెట్ లో 50 శాతాన్ని వారంలోగా పూర్తి చేస్తేనే సస్పెన్షన్లు వెనక్కి తీసుకుంటామని మంత్రికి కలెక్టర్ చెప్పినట్లు కార్యదర్శులు అంటున్నారు. దీంతో సీరియస్ అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కొద్ది రోజులు ఓపిక పట్టాలని, వెనక్కి తీసుకోకపోతే సీఎస్ జోషికి ఫిర్యాదు చేద్దామని కార్యదర్శులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.