
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అలకనంద మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అవయవదానం పేరుతో కిడ్నీల మార్పిడీ చేసిన ఏపీ విజయనగరం జిల్లా గంగన్నదొరవలస గ్రామానికి చెందిన గొండగొర్రి మురళీకృష్ణను రాష్ట్ర సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు. బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ చేసినట్టలు సీఐడీ చీఫ్ చారుసిన్హా తెలిపారు.
కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఈ ఏడాది జనవరి 22న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో హాస్పిటల్ నిర్వాహకులు, డాక్టర్లు సహా మొత్తం13 మందిని స్థానిక పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు ఏపీ పోలీసులతో కలిసి రాష్ట్ర సీఐడీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మురళీకృష్ణ తమిళనాడుకు చెందిన పేదలనే టార్గెట్ చేసేవాడని గుర్తించారు.
బెంగళూరుకు చెందిన ప్రదీప్, పవన్ సహా మరికొంత మంది మధ్యవర్తులతో కలిసి కిడ్నీలు మార్పిడి చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఒక్కో కిడ్నీకి రూ.10 లక్షలు తీసుకుని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు కిడ్నీ డోనర్లకు అందించేవారని సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసులో మే నెలలో తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్యలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.