బిహార్‌‌లో కూలిన  మరో బ్రిడ్జి

బిహార్‌‌లో కూలిన  మరో బ్రిడ్జి

సివాన్: బిహార్‌‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. సివాన్ జిల్లాలో  దారౌండా, మహారాజ్‌‌గంజ్ గ్రామాల మధ్య నిర్మించిన వంతెన శనివారం తెల్లవారుజామున 5 గంటలకు కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిహార్​లో వారం రోజులలో రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి. గత మంగళవారం అరారియా జిల్లాలో 180 మీటర్ల పొడవుతో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది.

ఈ ఘటనపై గ్రామీణ పనుల శాఖ సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలను ప్రారంభించింది. కాగా, శనివారం కూలిపోయిన వంతెనను దారౌండా, మహారాజ్‌‌గంజ్ గ్రామాలను కలుపుతూ..1991లో అప్పటి మహారాజ్‌‌గంజ్ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ సహకారంతో నిర్మించారని స్థానికులు తెలిపారు. 20 అడుగుల పొడవైన ఈ వంతెనను ఎమ్మెల్యే స్థానిక ఏరియా డెవలప్‌‌మెంట్ ఫండ్ ద్వారా నిర్మించినట్టు ధ్రువీకరించారు.

విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కాగా, వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.