నేలపై పడేసి కొట్టి, కత్తితో పొడిచారు: ఆస్ట్రేలియాలో మరో భారత సంతతి వ్యక్తిపై దాడి

నేలపై పడేసి కొట్టి, కత్తితో పొడిచారు: ఆస్ట్రేలియాలో మరో భారత సంతతి వ్యక్తిపై దాడి

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్‎లో భారత సంతతి వ్యక్తిపై దాడి జరిగింది. జాత్యంహకార వ్యాఖ్యలు చేస్తూ దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో బాధితుడి మణికట్టు దాదాపు పూర్తిగా తెగిపోయింది. ఇటీవల ఆడిలైడ్‎లో జరిగిన దాడి ఘటన మరవకముందే మరో భారత సంతతి పౌరుడిపై దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 19న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని సౌరభ్  ఆనంద్(33) గా గుర్తించారు. ఆనంద్ ఈ నెల 19న మెల్ బోర్న్‎లోని ఆల్టోనా మిడోవ్స్‎లో ఓ దుకాణంలో మందులు కొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు టీనేజర్లు ఆనంద్‎ను సమీపించి అతడితో వాగ్వాదానికి దిగారు.

తర్వాత నేలపై పడేసి కడుపు, తల, ముఖంపై తీవ్రంగా కొట్టారు. వారిలో ఒకడు ఆనంద్  జేబుల్లో చేతులు పెట్టి డబ్బుల కోసం వెతికాడు. మూడో వ్యక్తి కత్తి తీసి ఆనంద్ గొంతు వైపు పెట్టాడు. దీంతో బాధితుడు ఆత్మరక్షణ కోసం చేతులు అడ్డుపెట్టుకోగా.. కత్తితో దుండగుడు ఆనంద్ చేతిపై తీవ్రంగా పొడిచాడు. దీంతో కత్తి..  ఆనంద్ మణికట్టు ఒకవైపు నుంచి మరోవైపు తేలింది. దాడి తర్వాత దుండగులు పారిపోయారు. అటుగా వెళ్తున్న బాటసారులు గమనించి బాధితుడిని హాస్పిటల్​కు తరలించారు. వైద్యులు సర్జరీ చేసి ఆనంద్​ మణికట్టును తిరిగి అతికించారు. బాధితుడి ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.