పెట్టుబడి పేరుతో జనానికి 10 కోట్ల టోకరా.. పోలీసుల అదుపులో నిందితులు

పెట్టుబడి పేరుతో జనానికి 10 కోట్ల టోకరా.. పోలీసుల అదుపులో నిందితులు

సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.10 కోట్లు మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పి  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వారి బంధువులు టార్గెట్గా వారిద్దరు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.

హాదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ, ఉమా శంకర్ లు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, రియలెస్టేట్, బోర్ వెల్స్ రంగాల్లో పెట్టుబడుల పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. ట్రిపుల్ ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది తదతర చిత్రాల్లో పెట్టుబడులు పెడతామని నమ్మించారు. భారీ లాభాలు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు బాధితులు వారికి సొమ్ము అప్పజెప్పారు. ఇలా 30 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వారి బంధువుల నుంచి నిందితులు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేశారు. 

నెలలు గడిచినా డబ్బు తిరిగివ్వకపోవడంతో అంజమ్మ, ఉమాశంకర్ ను బాధితులు నిలదీశారు. దీంతో వారిని మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. దీంతో బాధితులంతా కలిసి తమను మోసం చేసిన నాగం ఉమాశంకర్, కొంగర అంజమ్మ చౌదరితో పాటు ఆమె కొడుకు కొంగర సుమంత్, కూతురు హేమపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ప్రధాన సూత్రధారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.