
హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయాన్ని గుర్తించారు పోలీసులు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పిల్లలను అమ్ముకున్నట్టు నిందితురాలు డాక్టర్ నమ్రత కూడా అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చే పిల్లలను కొనుగోలు చేశామని డాక్టర్ నమ్రత చెప్పిందన్నారు. అయితే, పిల్లలను కొనుగోలు చేసిన ఏజెంట్‌ల వివరాలు మాత్రం లేవని డాక్టర్ చెప్పారని పోలీసులు తెలిపారు.
80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీసేందుకు డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి ఓ సారి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. తాజాగా 80 మంది పిల్లల వ్యవహారం బయటపడటంతో ఆ వివరాలు రాబట్టేందుకు ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు.
కాగా, సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని.. సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తున్నది. వీర్యం తీసుకునేప్పుడు వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం.
దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు.. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. ఐవీఎఫ్, సరోగసీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కొందరు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని సమాచారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు సిటీలో కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఏపీలోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్‌కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్లు సమాచారం.