లోన్ యాప్స్ అరాచకాలు.. మరొకరు ఆత్మహత్య

లోన్ యాప్స్ అరాచకాలు.. మరొకరు ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలు తీసుకుంటే... లక్షలు కట్టాలని వేధిస్తుండడం, పర్సనల్ విషయాలను ఇతరులకు షేర్ చేస్తామని హెచ్చరిస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో.. తెలియక వారు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. అక్కడక్కడ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. లోన్ యాప్ వేధింపులు భరించలేక మంచిర్యాల వాసి సూసైడ్ చేసుకున్నాడు. 
మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం..మామిడిపెళ్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్(35) అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ ద్వారా ఓ యాప్ నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడని కానీ.. దానికి రూ. 7 లక్షలు కట్టాలంటూ వేధింపులకు గురి చేశారని  ఆత్మహత్య చేసుకున్న రాజేంద్రప్రసాద్ స్నేహితుడు వెల్లడించారు.

కుటుంబం పోషించడానికి డబ్బులు తీసుకుంటే.. చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తామని బెదిరించారన్నారు. 18వ తేదీన భార్య లేని టైంలో పురుగుల మందు తాగాడని పోలీసులు తెలిపారు. వెంటనే కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకళ్లారని, చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడన్నారు. లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అతని భార్య ఫిర్యాదు చేసిందన్నారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతోందన్నారు. ఎవరూ కూడా లోన్ యాప్స్ అప్రోచ్ కావొద్దని సూచించారు. అవసరమైతే స్నేహితులు, కుటుంబసభ్యుల దగ్గర డబ్బులు తీసుకోవాలని సూచించారు. సైబర్ క్రైం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు.. ధైర్యంగా పీఎస్ ను సంప్రదించాలన్నారు.