కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో 6 వేల కోట్ల అప్పు

కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో 6 వేల కోట్ల అప్పు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుకు మరో రూ. 6 వేల కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు లోన్‌‌ లింకేజీ లేని ప్యాకేజీల్లో పనులు పూర్తి చేయడానికి అప్పు కోసం   సీఎం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చారు. ఇందుకు ప్రతిపాదనలను ఆఫీసర్లు  సిద్ధం చేస్తున్నారు. పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకు నుంచి లోన్​ తీసుకోనున్నారు. బ్యాంకు ఓకే  చెప్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అప్పులు రూ.1.06 లక్షల కోట్లకు చేరనున్నాయి. ప్రాజెక్టు లింక్‌‌ – 5లోని ముల్కలపల్లి నుంచి చిట్యాల వరకు ప్యాకేజీ -16  పనులను రూ. 1,059 కోట్లతో, బస్వాపూర్‌‌ రిజర్వాయర్‌‌ను రూ.1,676 కోట్లతో చేపట్టారు. లింక్‌‌ – 6లో మల్లన్నసాగర్‌‌ నుంచి సింగూరుకు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌‌, టన్నెళ్ల పనులను 17, 18, 19 ప్యాకేజీల్లో చేపడుతున్నారు. రూ. 2,512 కోట్లతో ఈ పనులు ప్రారంభించినా టెక్నికల్​ కారణాలు, నిధుల కొరతతో 20 శాతం పనులు కూడా కాలేదు. లింక్‌‌ – 7లో ఎస్సారెస్పీ నుంచి మాసానిట్యాంక్‌‌, కొండెం చెరువు, భూంపల్లి రిజర్వాయర్‌‌ అక్కడి నుంచి చెరువులకు లింక్‌‌ చేసే పనులను 21,  22 ప్యాకేజీల్లో చేపడుతున్నారు. రూ. 3,737 కోట్లతో టన్నెళ్లు, గ్రావిటీ కాలువలు, పంపుహౌస్‌‌లు నిర్మిస్తున్నారు. ఈ పనులు నిధుల కొరతతో మెల్లగా సాగుతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి దిలావర్‌‌పూర్‌‌, హంజర గ్రామాలకు నీటిని తరలించే రెండు ప్యాకేజీలను 27,  28గా పేర్కొంటారు. రూ. 1,200 కోట్లతో చేపట్టిన పనులు సగం వరకు పూర్తయ్యాయి. రూ.10,184 కోట్లతో ప్రతిపాదించిన పనులకు నిధుల కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్ర బడ్జెట్‌‌ నుంచి ఆశించిన మేరకు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో అప్పులు తేవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు అప్పులు ఇట్లా..

కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్‌‌ కార్పొరేషన్‌‌  ఇప్పటికే ఆర్థిక సంస్థలు, వివిధ బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్ల అప్పులు చేసింది. కొత్తగా ప్రతిపాదించే అప్పును పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకు మంజూరు చేస్తే ఈ మొత్తం రూ. 1.06 లక్షల కోట్లకు చేరనుంది. ప్రాజెక్టుకు పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, రూరల్‌‌ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌‌, నాబార్డు, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని 9 బ్యాంకుల కన్సార్షియం, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకు నేతృత్వంలోని 11 బ్యాంకుల కన్సార్షియం, విజయ బ్యాంకు అప్పులు ఇచ్చాయి. ఈ అప్పుల్లో బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు తీసుకున్నవి రూ.21 వేల కోట్లు కాగా, నాబార్డు నుంచి రూ. 6 వేల కోట్లకు పైగా తీసుకున్నారు. మిగతా మొత్తాన్ని 2 ఫైనాన్స్‌‌ కార్పొరేషన్ల నుంచి తెచ్చారు. 9.2 శాతం నుంచి 10.9 శాతం వరకు వడ్డీకి అప్పులు తీసుకున్నారు.