టెండర్లు లేకుండనే.. డిజిటల్ వాల్యుయేషన్ పనులు

టెండర్లు లేకుండనే.. డిజిటల్ వాల్యుయేషన్ పనులు

హైదరాబాద్, వెలుగు:   నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ(టీయూ)లో మరో బాగోతం బయటపడింది. ఇప్పటికే వర్సిటీ వైస్ చాన్సలర్​పై అనేక అవినీతి ఆరోపణలు వస్తుండగా.. తాజాగా డిజిటల్ ఆన్ స్ర్కీన్ వాల్యుయేషన్​  ప్రక్రియలో కూడా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్లుగా ఎలాంటి టెండర్ లేకుండనే, వారికి నచ్చిన సంస్థకు పనులు కట్టబెట్టారు. తద్వారా లక్షల రూపాయల దుర్వినియోగం జరుగుతోందని చెప్తున్నారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీలు అప్​గ్రేడ్ అవుతున్నాయి. ఇదివరకూ ఎగ్జామ్స్ ఆన్సర్ షీట్లను ఆఫ్​లైన్ లో వాల్యుయేషన్​ నిర్వహించేవారు. ప్రస్తుతం డిజిటల్ ఆన్ స్ర్కీన్ వాల్యుయేషన్​కు మారిపోయారు. ఇదే కోవలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి టీయూ కూడా చేరింది. అయితే, ఏదైనా పనులు చేసేటప్పుడు టెండర్ల ద్వారా సంస్థలను ఎంపిక చేయాలి. ఆ ప్రక్రియలో గత అనుభవం, లోయెస్ట్ ప్రైస్ ను పరిగణనలోకి తీసుకుని పనులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, టీయూలో అదేదీ కనిపించలేదు. డిజిటల్ వాల్యుయేషన్​లో అనుభవం లేని ‘కోసిన్ లిమిటెడ్’ అనే సంస్థకు కట్టబెట్టారు. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎల్ఎల్​బీ, బీఈడీ తదితర కోర్సుల స్టూడెంట్ల ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్​ పనులు అప్పగించారు. 

అయితే పైలెట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నట్టు ఈసీకి సమాచారమిచ్చిన యూనివర్సిటీ అధికారులు మొత్తం అన్ని కోర్సులకూ దీనిని అమలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీవాల్యుయేషన్​, రీకౌంటింగ్ ఫలితాలను కూడా ఆలస్యంగా ఇస్తున్నారని స్టూడెంట్లు  చెప్తున్నారు. మరోవైపు టీయూలో డిజిటల్ వాల్యుయేషన్​  చేస్తున్నట్టు చూపించిన కోసిన్ సంస్థ.. ఇంటర్ బోర్డు ద్వారా 10 లక్షల మంది స్టూడెంట్ల డిజిటల్ వాల్యుయేషన్​ టెండర్లలో కూడా పాల్గొన్నది. అంతేకాదు టెండర్లు సైతం ఆ కంపెనీయే దక్కించుకున్నది.    

భారీగానే రేట్లు...

టీయూ పరిధిలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) స్టూడెంట్లు 52 వేల మంది, వివిధ కోర్సుల పీజీ స్టూడెంట్లు14 వేల మంది వరకూ ఉన్నారు. అయితే, ఆన్​లైన్ డిజిటల్ వాల్యుయేషన్​ నిర్వహించినందుకు యూజీలో ఒక్కో స్టూడెంట్​కు రూ.15, పీజీ స్టూడెంట్​కు రూ.17 చొప్పున ‘కోసిన్’ లిమిటెడ్ సంస్థకు ఇస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. టెండర్లు లేకుండా ఇంతపెద్ద మొత్తం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 2021–22, 2022–23 విద్యాసంవత్సరాలు ఇప్పటికే పూర్తికాగా, తాజాగా 2023–24 విద్యాసంవత్సరానికీ వర్సిటీ అధికారులు వర్క్ ఆర్డర్ ఇచ్చేశారు.

టెండర్లు లేకుండ ఇచ్చింది నిజమే

డిజిటల్ వాల్యుయేషన్​ ప్రక్రియను టెండర్లు లేకుండానే కోసిన్ సంస్థకు ఇచ్చింది నిజమే. ఇది కేవలం ట్రయల్ బేస్డ్ గానే వర్సిటీలోని స్టూడెంట్లందరికీ చేపట్టాం. పైనుంచి ఉన్నతాధికారులు చెప్తేనే, ఆ సంస్థకు పనులు ఇచ్చాం. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ సంవత్సరం డిజిటల్ వాల్యుయేషన్​ప్రక్రియకు టెండర్లు పిలవాలని భావిస్తున్నం.  

‑ రవీందర్ గుప్తా, వీసీ, తెలంగాణ యూనివర్సిటీ