
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ స్కూల్ ఘటన మరువకముందే.. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని కస్తూర్భా పాఠశాలలో మరో విద్యార్థిని చనిపోయింది. రాత్రి స్కూల్ భోజనం తిన్న ఐశ్వర్యకు ఉదయం నోటి నుంచి నురగ రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకెళ్లారు. అక్కడి చికిత్స తీసుకుంటూ చనిపోయింది. మృతురాలు ఐశ్వర్యది కాగజ్ నగర్ మండలం అంకుశ్ పూర్..
విద్యార్థిని ఐశ్వర్య మృతదేహంతో కస్తూర్బా స్కూల్ ముందు కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీష్ బాబు కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. విద్యార్థికి న్యాయం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతో జిల్లా విద్యాశాఖ అధికారి చర్చలు జరిపారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.