రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి

హైదరాబాద్: రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారని, వెంటనే నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గురువారం గాంధీభవన్ లో మీడియాతో శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే డిమాండ్ తో వచ్చిందన్నారు. ఉద్యోగాల పేరుతో ఏడేళ్లుగా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పగా..  91 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. పైగా బిశ్వాల్ కమిటీ తప్పుడు రిపోర్టు ఇచ్చిందని అబద్ధమాడుతున్నారని ఆరోపించారు. ఒక వేళ తప్పుడు రిపోర్టు ఇస్తే  ఆ కమిటీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. 

ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. ఉద్యోగాల గురించి మాట్లాడిన కేసీఆర్ నిరుద్యోగ భృతి గురించి నోరు మెదపడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై కేసీఆర్ కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ఒక్కరోజు దీక్షకు దిగినందుకే ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారని, క్షమాపణ చెప్పిన తర్వాతే వాళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఫీల్డ్ అసిస్టెంట్లను అవమానించడమేనన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయం వల్ల 70 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ప్రాణాలు తీసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రెండేళ్ల జీతంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, యువతకి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టి..సెల్ఫ్ ఎంప్లొయిమెంట్ కోసం కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

భజ్జీకి ఆప్ బంపర్ ఆఫర్ 

తెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి