"అంటే సుందరానికీ" ఓ మంచి ఫ్యామిలీ సినిమా

"అంటే సుందరానికీ"  ఓ మంచి ఫ్యామిలీ సినిమా

భలే భలే మగాడివోయ్, నేను లోకల్ లాంటి సినిమాలతో ఫన్ ఎంటర్ టైనర్ ను అందించిన నేచురల్ స్టార్ నాని... కొన్ని యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్ని రోజులకి అతని మేన్ స్ట్రీమ్ కామెడీ పండించే రోల్ తో తాజాగా "అంటే సుందరానికీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది. అసలు కథ ఏంటీ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..

కథ పరంగా చూసుకుంటే.. నాని సంప్రదాయ బద్దమైన బ్రహ్మణ కుటుంబంలో పుడతాడు. అన్ని ఆచారాలు, కట్టుబాట్లు పాటిస్తుంటారు. వేరే మతం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇక హీరోయిన్ నజ్రియా క్రిస్టియన్. వాళ్లకు కూడా మతపరమైన పట్టింపులుంటాయి. వీరిద్దరూ చిన్నప్పటినుండి కలిసి పెరుగుతారు. నానికి నజ్రియా అంటే ఇష్టమున్నా.. చెప్పడానికి ధైర్యం చేయడు. కానీ కొన్ని రోజులయ్యాక ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ఇరు ఫ్యామిలీలల్లో చెప్పడానికి ధైర్యం చాలదు. దీనికి వాళ్లు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటి.? చివరకు పెద్దలు ఒప్పుకున్నారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఫస్టాఫ్ లెన్తీ... కన్ ఫ్యూజన్

‘‘అంటే సుందరానికి’’ సింపుల్ ఫన్ఎంటర్ టైనర్. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ చాలా చిన్న పాయింట్ ను కాస్త కాంప్లికేటెడ్ చేసి చెప్పాడు డైరెక్టర్. కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సీన్ల వల్ల సినిమా ల్యాగ్ అవడమేకాకుండా కన్ ఫ్యూజన్ నెలకొంది. ఫస్టాఫ్ స్లోగా, నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు 10 నిమిషాల నుండి అసలు కథ వస్తుంది.అప్పటివరకు చాలా బోరింగ్ గా సాగుతుంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర 15 నిమిషాల వరకు కోసేయొచ్చు.మరి ఎందుకలా వదిలేసారో అర్థం కాదు. ఉదాహరణకు చైల్డ్ హుడ్ ఎపిసోడ్ చాలా లెన్తీగా ఉంది. అది క్రిస్పీగా కూడా చెప్పొచ్చు.

ఓ మంచి ఫ్యామిలీ సినిమా

కానీ సెకండాఫ్ మాత్రం ఎంటర్ టైనింగ్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఎక్కడా బోర్ రాదు. ఇక్కడ డైరెక్టర్ ను అభినందించాలి. సెన్సిటివ్ ఇష్యూని మెచ్యూర్డ్ గా హాండిల్ చేశాడు.సెకండాఫ్ లో రాసుకున్న సీన్లు బాగున్నాయి. దానివల్ల ఫస్టాఫ్ లో జరిగిన లోపాలు పెద్దగా కనిపించవు. ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్ తో బయటకు వస్తారు ఆడియన్స్.

నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ అబ్బాయిగా బాగా చేశాడు. తన స్టార్ డమ్ ను పక్కనెట్టి ఇలాంటి కథ చేయడం బాగుంది. ముందు సినిమాలల్లో లాగా ఎక్కడా హీరోయిజం చూపించలేదు. ఎంత అవసరమో అంతే చేశాడు. నజ్రియా క్యూట్ పర్ఫర్మెన్స్ తో ఆకట్టుకుంది. తన పాత్రకు మంచి వెయిట్ ఉంది. నాని తండ్రిగా నరేష్ రాణించాడు. వాళ్లిద్దరి కాంబినేషన్ మరోసారి సక్సెస్ అయింది. తల్లి పాత్రలో రోహిణి కూడా చాలా బాగా చేసింది. నజ్రియా పేరేంట్స్ రోల్స్ లో నదియా, అలగం పెరుమాళ్ కూడా మెప్పించారు. అలగం పెరుమాళ్ పాత్రలో కాస్త ముఖ పరిచయమున్న వాళ్లను పెట్టుకుంటే బాగుండేది. బామ్మ పాత్రలో అరుణ బిక్షు సూట్ అయింది. అనుపమా పరమేశ్వరణ్ చిన్న రోల్ లో వచ్చి సర్ ప్రైజ్ చేసింది. హర్షవర్థన్ కామెడీ పండించాడు.

ప్లస్ అయిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్

నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించి. పాటల్లో ‘‘ఎంత చిత్రం’’ అనే సాంగ్ ఒక్కటే బాగున్నా.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు. మంచి నేపథ్య సంగీతం వల్ల కాస్త ల్యాగ్ ఉన్న సీన్లు కూడా ఫర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండాల్సింది. వివేక్ ఆత్రేయ రాసుకున్న డైలాగులు కొన్ని చాలా బాగున్నాయి.

 ఫస్టాఫ్ ను కాస్త భరిస్తే చాలు..

ఇక ఇలాంటి రెండు మతాల నడుమ నలిగిపోయే ఒక ప్రేమ కథను బాగా డీల్ చేశాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.సెన్సిబుల్ రైటింగ్ మెప్పిస్తుంది. ఇది కొత్త స్టోరీ కాకపోయినా.. దాన్ని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే దీన్నే ఇంకాస్త షార్ట్ గా ఎగ్జిగ్యూట్ చేస్తే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఫస్టాఫ్ ను కాస్త భరిస్తే.. ఈ మూవీ నచ్చుతుంది.

రివ్యూ: అంటే సుందరానికీ
రన్ టైమ్: 2 గంటల 57 నిమిషాలు
నటీనటులు: నాని,నజ్రియా, నరేష్, నదియా, రోహిణి, అలగం పెరుమాళ్, హర్ష వర్థన్, పృథ్వీ తదితరులు
సినిమాటోగ్రఫీ: నిఖిత్ బొమ్మి
మ్యూజిక్ : వివేక్ సాగర్
ఎడిటింగ్ : రవితేజ గిరిజాల
ప్రొడ్యూసర్లు: నవీన్ యేర్నేని, రవి యలమంచిలి
రచన,దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
రిలీజ్ డేట్: జూన్ 10,2022