
డెహ్రాడూన్: భాగస్వామితో విభేదాలు వచ్చినప్పుడల్లా అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు ఆయుధంగా ఉపయోగించుకుంటూ, దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. చాలా కాలంగా కలిసి ఉంటూ, విభేదాల వల్ల విడిపోయిన తర్వాత తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ వ్యక్తిపై నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ జస్టిస్ శరద్ కుమార్ శర్మ జులై 5న తీర్పు వెలువరించారు. అయితే, వీరు 2005 నుంచి పరస్పర అంగీకారంతో కలిసి ఉంటున్నారని కోర్టు పేర్కొంది. ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో ఫిజికల్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తూ, వారిలో ఒకరు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే, దానిని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పదేపదే చెప్పిందని జడ్జి గుర్తుచేశారు. తామిద్దరం అంగీకారంతోనే 2005 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నామని బాధితురాలు పిటిషన్‌లో పేర్కొంది. అయితే, నిందితుడు కొన్ని రోజుల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత కూడా తమ రిలేషన్ కొనసాగిందని 2020 జూన్ 30న ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుడు పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా బాధితురాలు అతనితో రిలేషన్‌షిప్ కొనసాగించినప్పుడు, అది ఇష్ట ప్రకారమే జరిగినట్లు అవుతుందని హైకోర్టు పేర్కొంది. పెళ్లి విషయంలో రిలేషన్‌పిష్ స్టార్టింగ్ టైమ్‌లోనే ఆలోచన చేయాలని, కొన్నేండ్లు రిలేషన్ కొనసాగించిన తర్వాత కాదని కోర్టు పేర్కొంటూ కేసును రద్దు చేస్తున్నామని తీర్పు వెలువరించింది.