ఒక్క డోస్ వేసుకున్నా.. 300%  యాంటీబాడీలు

ఒక్క డోస్ వేసుకున్నా.. 300%  యాంటీబాడీలు
  •     టీకా డోసుల మధ్య గ్యాప్​ మంచిదంటున్న సైంటిస్టులు
  •     6 నెలల తర్వాత సెకండ్​ డోస్​తో మెరుగైన ఫలితాలంటున్న కెనడా స్టడీ
  •     9 నుంచి 15 వారాలుండాలని మరికొందరు సైంటిస్టుల కామెంట్​

న్యూఢిల్లీ:ఈ మధ్యే కొవిషీల్డ్​ సెకండ్​ డోసుకు ఆరు వారాలుగా ఉన్న గ్యాప్​ను 12 నుంచి 18 వారాలకు పెంచింది కేంద్ర సర్కార్​. కరోనా వ్యాక్సిన్ల కొరతను కప్పి పుచ్చుకునేందుకే రెండు డోసుల మధ్య గ్యాప్​ను పెంచారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే, రెండు డోసుల మధ్య గ్యాప్​ ఎంత ఎక్కువుంటే.. వ్యాక్సిన్​ అంత బాగా పనిచేస్తుందని ప్రపంచంలోని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. వ్యాక్సిన్​ ఏదైనా సరే ఒక్క డోసు వేసుకున్న తర్వాత రెండో డోసుకు ఎక్కువ గ్యాప్​ తీసుకుంటే 300 శాతం వరకు యాంటీబాడీలు తయారవుతాయని సైంటిస్టులు అంటున్నారు. 

ఇమ్యూనిటీ పెరుగుతది..

ఒక డోస్​ వ్యాక్సిన్​తో ఇమ్యూన్​ సిస్టమ్​ పనితీరు పెరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు. దానికి ఇంకొంచెం టైం ఇస్తే వైరస్​ను నాశనం చేసేందుకు మరింత శక్తిమంతంగా మారుతుందని చెప్తున్నారు. ఎంత ఎక్కువ గ్యాప్​ ఉంటే ఇమ్యూన్​ సిస్టమ్​ అంత ఎక్కువ పవర్​ఫుల్​గా తయారవుతుందని వివరిస్తున్నారు. అప్పుడు సెకండ్​ డోస్​ వేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. 80 ఏండ్లకు పైబడిన వారికి ఫైజర్​ వ్యాక్సిన్​ ఫస్ట్​ డోస్​ ఇచ్చి.. సెకండ్​ డోస్​ను మూడు వారాలకు బదులు మూడు నెలలకు ఇస్తే 3.5 రెట్ల యాంటీబాడీలు తయారయ్యాయని చెప్తున్నారు. రెండు డోసుల మధ్య తేడా 9 నుంచి 15 వారాలుంటే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు, వైరస్​ బారిన పడడం, మరణాలు చాలా వరకు తగ్గాయని అంటున్నారు. అదే గ్యాప్​ 6 నెలలుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కెనడా సైంటిస్టుల స్టడీలో తేలింది. సెకండ్​ డోస్ ను ఆలస్యంగా ఇవ్వడం వల్ల కొన్ని వేల మందికి ఫస్ట్​ డోస్​ వ్యాక్సిన్​ వేసేందుకు వీలవుతుందని సింగపూర్​ నేషనల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ డేల్​ ఫిషర్​ చెప్పారు. ఈ లెక్కన రోజూ 40 వేల మందికి టీకాలు వేసేందుకు టార్గెట్​ పెట్టుకున్నామన్నారు. ఎండాకాలం నాటికి 47 లక్షల మందికి టీకాలిస్తామన్నారు.

అందరికీ వ్యాక్సిన్​ ఇవ్వొచ్చు

వ్యాక్సిన్​ సెకండ్​ డోస్​ను లేట్​ చేసినా లాభమే తప్ప నష్టమైతే ఉండదని మాయో క్లినిక్​ వ్యాక్సిన్​ రీసెర్చ్​ గ్రూప్​ వైరాలజిస్ట్​ గ్రెగరీ పోలండ్​ అన్నారు. ఫస్ట్​ డోస్​ వేసుకున్నాక సెకండ్​ డోస్​కు ఎక్కువ గ్యాప్​ ఇవ్వడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు కుదురుతుందన్నారు. ఇప్పటికే నాలుగు వారాల గ్యాప్​ను 6 నుంచి 8 వారాలకు పెంచింది సింగపూర్​ ప్రభుత్వం. ఇండియా సహా మరికొన్ని దేశాలూ రెండు డోసుల మధ్య టైంను పెంచాయి.