మానవాళికి ఇది రెడ్ అలర్ట్

మానవాళికి ఇది రెడ్ అలర్ట్
  • ఇట్లయితే.. గర్మీతో గడబిడే
  • గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించకుంటే ఇక కష్టం
  • క్లైమేట్ చేంజ్‌పై యూఎన్ రిపోర్ట్ విడుదల 
  • మానవాళికి ఇది రెడ్ అలర్ట్: ఆంటోనియో గుటెర్రస్ 

జెనీవా:  ‘‘ప్రపంచవ్యాప్తంగా సిటీలన్నీ గర్మీకి హాట్ స్పాట్లు అయిపోతున్నయి. కాంక్రీట్ జంగల్స్ గా మారిపోయిన సిటీల్లో వేడిమిని తగ్గించే చెట్లు, నీటి వనరులు తగ్గిపోవడం వల్ల గర్మీ పెరుగుతూ పోతోంది. అట్లనే.. గ్లోబల్ వార్మింగ్ ను పెంచే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పరిస్థితి ఇట్లనే కొనసాగితే.. ముందుముందు దునియా అంతటా జనం ఎండ వేడిమికి కుతకుతా ఉడికిపోవాల్సిందే. ఎక్కడికీ పారిపోలేరు. దాక్కోలేరు” అని యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలోని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) హెచ్చరించింది. ఇప్పటికిప్పుడు గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే మున్ముందు జరగబోయే వాతావరణ మార్పు సమస్యలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేసింది. క్లైమేట్ చేంజ్ పై సమగ్ర వివరాలతో ఐపీసీసీ రూపొందించిన ఈ 6వ రిపోర్టు సోమవారం విడుదలైంది. ఇది ‘ప్రపంచ మానవాళికి ఒక రెడ్ అలర్ట్’ అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభివర్ణించారు. 

గ్లోబల్ వార్మింగ్ తగ్గించడమే మార్గం.. 
నూరేండ్లలో గ్లోబల్ టెంపరేచర్ లు ఒక డిగ్రీ మేరకు పెరిగాయి. ఇప్పుడు 2030లలోనే మరో అర డిగ్రీ పెరిగే పరిస్థితులు ఉన్నయి. వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో.. ఇది మనుషులు తెచ్చుకున్న విపత్తుగా మారుతుందని ఐపీసీసీ స్పష్టం చేసింది. 2015 పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం.. కార్బన్ ఎమిషన్స్ ను తగ్గించేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే.. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం ఒక్కటే మార్గమని చెప్పింది. లేకపోతే.. ప్రపంచం హీట్ వేవ్స్ ధాటికి అల్లాడిపోవడం ఖాయమని హెచ్చరించింది. ఒకప్పుడు ప్రతి 50 ఏండ్లకు ఒకసారి ప్రపంచమంతటా హీట్ వేవ్ పరిస్థితి ఏర్పడేదని, ఇప్పుడు ప్రతి 10 ఏండ్లకు ఒకసారి హీట్ వేవ్ కండిషన్ వస్తోందని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఏడేండ్లకు రెండు సార్లు హీట్ వేవ్ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.