
పుట్టింది మలయాళ సీమలో అయినా అచ్చ తెలుగమ్మాయిలా అనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. అంతే చక్కగా తెలుగులో మాట్లాడుతుంది కూడా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జంటగా ఆమె నటించిన ‘రాక్షసుడు’ ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి అనుపమ చెప్పిన సంగతులు.
తమిళ చిత్రం ‘రాట్చసన్’ని మా నాన్న చూశారు. నన్నూ ఓసారి చూడమన్నారు కానీ కుదరలేదు. రీమేక్ గురించి రమేష్ వర్మ గారు చెప్పినప్పుడు చూశాను. చాలా నచ్చింది. బలమైన కంటెంట్. ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. వెంటనే ఓకే అన్నాను.
నాకిది రెండో రీమేక్. ‘ప్రేమమ్’ మొదటిది. దాని మాతృకలో చేసిన పాత్రనే తెలుగులోనూ చేశాను. దాంతో ఈ మూవీ రీమేక్ అనగానే ఒరిజినల్ మూవీలో నటించిన అమలాపాల్‌తో పోలుస్తారేమోని భయమేసింది. పైగా అమల అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అంతగా కాకపోయినా ఆ క్యారెక్టర్‌లోని ఎసెన్స్ తీసుకుని నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ రీతిలో నటించాను.
నిడివి తక్కువైనా కీలక మలుపులకు కారణమయ్యే పాత్ర నాది. సింపుల్‌గా ఉండే టీచర్. గతంలో నేను చేయని రోల్. కొంత మెచ్యూర్డ్ లుక్‌లో కనిపిస్తాను. ఐదో తరగతి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ కోసం చీర కట్టుకోవడం అలవాటైంది. అందుకే ఈ సినిమా కొత్తగా అనిపించలేదు. డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను.
స్వతహాగా నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఇది కూడా చాలా నచ్చింది. సినిమా అంతా సీరియస్‌గా ఉంటుంది. నేను, ఓ చిన్న పాప పాత్రతో మాత్రం కొంత ఫన్, రిలాక్సేషన్ ఉంటాయి.
షూటింగ్ చేసింది తక్కువ రోజులైనా సాయి శ్రీనివాస్‌తో మంచి స్నేహం కుదిరింది. తను చాలా స్వీట్ పర్సన్. ఇక రమేష్‌వర్మ ప్రతి విషయంలోనూ ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ముఖ్యంగా నా గెటప్ విషయంలో.
నటిగా సెట్‌లో జరిగే కొన్ని అంశాలే తెలు స్తాయి. వెనక ఏం జరుగుతోంది. ఎంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, టెక్నికల్ విషయాలేంటనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది నాకు. అందుకే ఓ మలయాళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నా ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న మూవీ. నేనే హీరోయిన్‌ని. నా పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 45 రోజులు పని చేశాను. సౌకర్యాలేవీ లేకుండా అందరితో కలసిపోయి పనిచేశాను. మూడు గంటలే పడుకున్నాను. అయినా ఎంతో సంతృప్తినిచ్చింది. కొంత స్కిన్ ట్యాన్ అయింది. కానీ అందుకోసం ఇంత చక్కని ఎక్స్ పీరియన్స్‌ని వదులుకోలేను కదా.
డైరెక్టర్ అవ్వాలని ఉంది కానీ మొదట మ్యూజిక్ వీడియోస్ లాంటివి చేసి.. రెగ్యులర్ సినిమాలా కాకుండా సహజత్వానికి దగ్గరగా మన చుట్టూ ఉండే వాళ్ల జీవితాల్ని తెరపై చూపించాలి. అలాంటి సినిమా కచ్చితంగా చేస్తాను.
తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను. అందువల్ల ఇక్కడ పని చేయడం చాలా ఈజీగా కంఫర్ట్‌గా ఉంటుంది. అదీకాక తెలుగు ప్రేక్షకులు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. అది ఇక్కడివారి బెస్ట్ క్వాలిటీ.
అధర్వ మురళి హీరోగా తెరకెక్కుతున్న ‘నిన్నుకోరి’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాను. కణ్ణన్ దర్శకుడు. తెలుగులో నివేద చాలా బాగా నటించింది కనుక నాకిది కొంత చాలెంజింగ్‌గానే ఉంటుంది. వరుస రీమేక్స్‌లో నటిస్తున్నాను. అలాగని రీమేక్ క్వీన్ అను బిరుదు వస్తుందని భయం లేదు. గతంలో టిక్ టాక్ క్వీన్ అన్నారని కూడా ఫీలవలేదు.
నటిగా చాలెంజ్ చేసే క్యారెక్టర్ నాకింకా దొరకలేదు. కానీ మంచి స్క్రిప్ట్‌లు వస్తున్నాయి. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ నచ్చి, ఇంకొన్ని క్యారెక్టర్ నచ్చి, మరికొన్ని టీమ్ నచ్చి చేస్తున్నాను. తెలుగులో రెండు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
‘ఫిదా’లో సాయిపల్లవి, ‘మహానటి’లో కీర్తీ సురేష్ పాత్రలు నాకు చాలా నచ్చాయి. ‘రంగస్థలం’లో రోల్ మిస్ చేసుకున్నందుకు కొంత ఫీలయ్యాను. కానీ సినిమా చూసినప్పుడు సమంత చాలా బాగా నటించింది, నాకంటే తను చేయడమే మంచిది అనిపించింది.