
టెహ్రాన్: ఇరాన్‌లోని ముస్లిం మత పెద్ద అయతుల్లా నాసర్ మకారెం షిరాజీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇరాన్‌పై దాడులకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను "మొహరేబ్ "(దేవుడి శత్రువులు)గా పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఈ ఇద్దరికి వ్యతిరేకంగా పనిచేయాలని.. ఇరాన్‌పై దాడులు చేసినందుకు పశ్చాత్తాపపడేలా చేయాలని ఫత్వా ద్వారా పిలుపునిచ్చారు.
"ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ దేవుడి శత్రువులు(మొహరేబ్). ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా వీరికి వ్యతిరేకంగా నిలబడాలి. ఇరాన్‌పై చేసిన దాడులకు వారు పశ్చాత్తాపపడేలా చేయాలి. ఇందులో భాగంగా.. ట్రంప్, నెతన్యాహులకు ముస్లింలు మద్దతు ఇవ్వడం లేదా సహకరించడం నిషేధం. ట్రంప్, నెతన్యాహు అనే దేవుడి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడే ముస్లింలను యోధులు(ముజాహిద్ ఫీ సబీలిల్లాహ్)గా గుర్తిస్తం. వారికి దైవిక బహుమతులు కూడా లభిస్తాయి" అని ఫత్వాలో అయతుల్లా నాసర్ మకారెం షిరాజీ పేర్కొన్నారు.
ఇస్లామిక్ చట్టం ప్రకారం.. మొహరేబ్‌గా పరిగణించినవాకి మరణశిక్ష అమలు చేస్తారు. శిలువ వేయడం, అవయవాలను కట్ చేయటం, లేదా బహిష్కరణ వంటి కఠిన శిక్షలు కూడా విధిస్తారు. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న అగ్ర సైనిక కమాండర్లను, శాస్త్రవేత్తలను చంపింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ దళాలకు అమెరికా సహకారం అందించింది. దీంతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
అనంతరం ఇరాన్ కూడా ఖతార్‌లోని ఓ అమెరికన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్, నెతన్యాహు బెదిరింపులు జారీ చేశారని ఆరోపణలు వచ్చాయి.