ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల

ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాలు  ఇవాళ (మంగళవారం) ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్ సంధ్యారాణీ విడుదల చేశారు. ఫలితాల్లో 94.88 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు.మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అంతేకాదు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండబోవన్నారు.

ఫలితాల్లో బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణ శాతం 94.68 కాగా..బాలికల ఉత్తీర్ణత శాత 95.09. ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం సాధించి మొదటి స్థానంలో నిలవగా..నెల్లూరు జిల్లా 83.19 శాతం తో చివరి స్థానంలో ఉంది. మొత్తం 5,400 స్కూళ్లలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా..మూడు స్కూళ్లలో ఉత్తీర్ణత జీరోగా నమోదైంది.

పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అంతేకాదు పరీక్షల్లో విజేతలు కానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. తల్లిదండ్రులు పరీక్ష లో ఫెయిల్ అయిన విద్యార్థులను…ఇతరులతో పోల్చి నిరాశపర్చవద్దన్నారు. వారికి ఉత్తేజానిచ్చి ప్రేరణ శక్తులుగా నిలవాలని సూచించారు బాబు.