ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాసాలుగా మారాయి

ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాసాలుగా మారాయి
  • బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు

తిరుపతి: ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాసాలుగా మారాయని బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. హిందు ధర్మ పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ఆయన నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాగల ఐదేళ్లలో అభివృద్ధి పధంలో తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని వ్యూహం ప్రకారం ముందుకు వెళుతోందన్నారు. పెద్ద ఎత్తున ఆర్ధిక వ్యవస్థ పెరగడం కోసం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడుగడుగునా తూట్లుపొడిచే రీతిలో వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ.. ఇష్టానుసారం పప్పులు బెల్లాల్లా పంచిపెడుతూ గొప్పలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. హిందూ మత సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వం హిందూ సంస్థల చేతులు కట్టేసి... మిగతా మతాలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులను టిటిడి  ఏం చేస్తోంది..? అని ఆయన నిలదీశారు. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు హిందూ ధర్మ ప్రచారం... పరిరక్షణకు వాడతామన్నారు.. మరి ఏం చేశారు.. ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. దళితవాడల్లో ఎన్ని ఆలయాలను ఇప్పటివరకూ నిర్మించారు..? స్థానికులనే అర్చకులుగా తర్ఫీదు ఇచ్చి నియామకాలు చేస్తామని చెప్పి ఎంత మందిని తయారు చేశారని ప్రశ్నించారు. హిందూ మత సంస్థల చేతులు కట్టేసి ఇతర మత సంస్థల కార్యక్రమాలు ప్రోత్సహించడం ఎంత వరకు సబబు అన్నారు. ప్రతిచోట కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ విపక్షాలపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా కేంద్రం ఏపీని చూస్తుంటే.. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతోందన్నారు. రైల్వే లైన్లు ఇస్తామంటే.. పట్టించుకోలేదు.. మున్సిపాలిటీల్లో మౌళిక సదుపాయాలకు నిధులిస్తామంటే.. మా వాటా ఏమీ ఖర్చు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తుంటే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు పోవాలంటే.. బీజేపీ అధికారంలోకి వస్తేనే పరిస్థితులు మారుతాయని, అప్పుడే రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.