ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్ర బాబు.. తెలంగాణలో TDP బలోపేతంపై మీటింగ్

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్ర బాబు.. తెలంగాణలో TDP బలోపేతంపై మీటింగ్
  •  పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై చర్చ
  •  స్థానిక సంస్థల్లో పోటీపై చర్చించే చాన్స్
  •  సభ్యత్వ నమోదు పునరుద్ధరణపైనా నిర్ణయం
  •  తెలంగాణ లీడర్లకు ఏపీలో నామినేటెడ్ పోస్టులు?

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్యనేతలతో కీలక  సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు. ప్రస్తుతం ఆయన తాత్కలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 పాతనగరంలోని పురానా పూల్ ప్రాంతానికి చెందిన మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీలోనే కొనసాగుతున్నారు. మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కు మేనల్లుడైన అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలా పలువురు నేతలు ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. వీళ్లంతా ఆదివారం రోజున జరిగే కీలక సమావేశానికి హాజరవుతారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించే అంశంపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది. 

దీంతో పాటు జిల్లాల వారీగా ఇన్ చార్జీలు ఎవరనే అంశంపైనా ప్రాథమికంగా చర్చించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదుపైనా డిస్కస్ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశంపైనా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను ముందుగా యాక్టివ్ అవుతారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పాత నేతలకు సంబంధించిన జాబితాను ట్రస్ట్ భవన్ వర్గాలు ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. 

టీటీడీపీ లీడర్లకు నామినేటెడ్ పోస్టులు

తెలంగాణ టీడీపీ నాయకులకు ఏపీలో నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించవచ్చని సమాచారం. ఇందులో భాగంగా అరవింద్ కుమార్ గౌడ్ కు అవకాశం లభించవచ్చని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మిగతా వారికీ ఈ సారి చాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో చాలా పోస్టులు తెలంగాణ వారికి లభించాయి. ప్రస్తుతం కూడా టీటీడీపీ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు గానీ, సలహాదారులాంటి పదవులు కానీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.