దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి ఎన్ని వందల కోట్లంటే..

దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి ఎన్ని వందల కోట్లంటే..
  • ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి 931 కోట్లు
  • సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ సీఎం
  • ఫెమా ఖండు ఆస్తి రూ.332 కోట్లు
  • దేశంలో ఈ ఇద్దరు సీఎంలు బిలియనీర్లు
  • బెంగాల్ సీఎం మమత లీస్ట్
  • ఆమె ఆస్తి కేవలం రూ.15 లక్షలే
  • తాజా జాబితా విడుదల చేసిన ఏడీఆర్

హైదరాబాద్: దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నిలిచారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. అదే విధంగా చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఉన్నారు. ఆమె వద్ద కేవలం రూ. 15 లక్షల ఆస్తి మాత్రమే ఉన్నట్టు నివేదిక తేల్చింది. డిసెంబర్ 2024 తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల తర్వాత రూపొందించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా నివేదిక ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎంలు దాఖలు చేసిన అఫిడవిట్‌లలో పేర్కొన్న డేటా ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా రూ.931 కోట్లకు పైగా ఆస్తులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పెమా ఖండు (రూ.332 కోట్లు) తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రమే జాబితాలో బిలియనీర్లు. నివేదిక ప్రకారం, బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులు ప్రకటించగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.1 కోటి  కన్నా కొంచెం ఎక్కువ ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తి విలువ 30.10 కోట్లు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 

బెంగాల్ సీఎంకు ఇల్లు లేదు
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎలాంటి ఇల్లు, భూమి లేదు. 2020-21లో మమతా బెనర్జీ దాఖలు చేసిన ఆదాయపు పన్నురిటర్న్ , రూ. 15.4 లక్షలు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆమె ఆస్తుల విలువ 30.40 లక్షలు. ఆమె అఫిడవిట్‌లో తన వద్ద "చేతిలో నగదు" రూ. 69,255 అని, తన బ్యాంకు బ్యాలెన్స్ 13.5 లక్షలు ఉందని చెప్పారు. ఎన్నికల ఖర్చు ఖాతాలో1.50 లక్షలున్నట్టు పేర్కొన్నారు. 2019–20 సంవత్సరానికి గాను ఆమె పన్ను మినహాయింపు ద్వారా 1.8 లక్షలుగా చూపించారు. తన వద్ద 43,837 రూపాయల విలువైన 9 గ్రాముల బంగారం కూడా ఉందని వెల్లడించారు.