బనకచర్లతో కరువు శాశ్వతంగా దూరం : ఏపీ సీఎం చంద్రబాబు

బనకచర్లతో కరువు శాశ్వతంగా దూరం : ఏపీ సీఎం చంద్రబాబు
  • తెలంగాణ నేతలు అర్థం చేసుకోవాలి: ఏపీ సీఎం చంద్రబాబు
  • నదుల అనుసంధానంతో ఎన్నో లాభాలున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పోలవరం– -బనకచర్ల  ప్రాజెక్టుతో  వంశధార–-పెన్నా నదుల అనుసంధానం చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే జరిగితే రాయలసీమకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు కరవు అనేదే ఉండదని  అన్నారు.  తెలంగాణ ప్రజలు, నేతలు కూడా నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలన్నారు.   శనివారం ఏపీలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు  చంద్రబాబు జలహారతి ఇచ్చారు.

 అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ నేతలకు సూచిస్తున్నానని చెప్పారు.   నీళ్లు లేనప్పుడే వాటి విలువ తెలుస్తుందని అన్నారు. జలాశయాల్లో నీటి నిల్వ ఎంత ముఖ్యమో, భూమినే జలాశయంగా తయారుచేసుకోవడం అంతకంటే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒక యజ్ఞం ద్వారా అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని, దానిని భగ్నం చేసేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 

  హంద్రీ నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జలాలు కుప్పం చివరి భూములకు చేరాయని,  శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుందని అన్నారు. తనను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన  కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంతో  జన్మ ధన్యమైందని, తన సంకల్పం నెరవేరిందని తెలిపారు.