ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్​కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన కరెంట్​కు సంబంధించి తెలంగాణ, ఏపీకి బకాయిపడిందని వివరించారు. శుక్రవారం పార్లమెంట్ లోని పీఎం ఆఫీసులో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఏపీకి సంబంధించిన 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. విభజన జరిగి తొమ్మిదేండ్లు గడుస్తున్నా.. చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

కీలకాంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఏపీకి సంబంధించి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నాటి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద పెండింగ్​లో ఉన్న రూ.36,625 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకారం అందిస్తే కొద్దికాలంలోనే పోలవరం పూర్తవుతుందని, ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసిందని, ఈ బకాయిలను చెల్లించాలని కోరారు. పోలవరం అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అడహక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.