నేడు సీబీఐ కోర్టుకు జగన్

నేడు సీబీఐ  కోర్టుకు జగన్

హైదరాబాద్, వెలుగు: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ నేడు( శుక్రవారం) సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన కోర్టు విచారణకు వస్తున్నారు. జగన్‌‌తో పాటు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాజరవుతున్నారు. ఏపీ  సీఎంకు వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ కోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ సీఎం హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. మూడు రాజధానుల ప్రకటన తరువాత జగన్‌‌ కాన్వాయ్‌‌ను ఆందోళనకారులు అడ్డుకుంటారన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై 11 చార్జ్ షీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌‌షీట్ లో ఏ-1 నిందితుడిగా జగన్ పేరును, ఏ2 గా విజయసాయిరెడ్డి పేరు నమోదు చేశారు. వీరిద్దరు గత కొంత కాలంగా కోర్టు విచారణకు హాజరు కాకుండా మెమోలు దాఖలు చేస్తున్నారు. జగన్ మినహాయింపు పిటిషన్ కొట్టివేసినా విచారణ కు హాజరు కావడంలేదు. హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జగన్ నేడు కోర్టుకు వస్తున్నారు.

స్టేకు వెళ్లకుండా కోర్టుకు…

గతంలో సీఎంలు న్యాయస్థానంలో ఉన్న కేసులపై సీఎం హోదాలో కోర్టులకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తనపై ఉన్న  కేసులకు చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం సీబీఐ కోర్టు మినహాయింపు పిటిషన్ కొట్టివేసినా హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లకుండా కోర్టుకు హాజరవుతున్నారు.