కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన ఇవాళ రెండోరోజు బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి  గజేంద్రసింగ్‌ షెకావత్‌ ను కలిశారు. కొద్దిసేపు ముఖాముఖి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.  సీఎం జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు.

2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే తెలంగాణతో ఇరుగు పొరుగు రాష్ర్టాలతో జల వివాదాలు.. నీటి వాటాలు.. చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో  సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా నివాసంలో భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.