
పశ్చిమ గోదావరి: ఏలూరులో సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా తక్కువ సార్లు బయటకు వచ్చిన సీఎం జగన్.. తొలిసారిగా శంకుస్థాపన కార్యక్రమాలకు స్వయంగా హాజరయ్యారు. ఉదయమే విజయవాడ నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి ఏలూరు లోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగారు. తమ్మిలేరు వాగు రక్షణ గోడ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు నగర మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతుల కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో సీఎ జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు.