వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఏరియల్‌ సర్వే చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌ లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్‌ పరిశీలించారు. గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 
కడప జిల్లా రాజంపేట పరిధిలో వరదల్లో 12 మంది చనిపోవడం.. అనంతపురం జిల్లా కదిరిలో మూడంతస్తుల భవనం కూలి పలువురు చనిపోగా ఇంకొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.  అలాగే అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయినగర్ కాలనీ నీటమునగడంతో దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి ఘటనలతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి నిన్న శుక్రవారం సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన సొంత జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుండడంతో సీఎం జగన్ స్పందించి శనివారం గన్నవరం నుంచి విమానంలో కడపకు చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో వర్షాలు, వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. 
ఏరియల్ సర్వేకు ముందు పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడిన సీఎం జగన్ పరిస్థితిని నేరుగా పరిశీలించేందుకు ఏరియల్ సర్వే చేపట్టారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లా సహా వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిస్థితి సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులతోపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు.