
అమరావతి: పోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జరగాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76 వేల మంది పోలీసు సిబ్బందితో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో… ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అధికారులకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి, అలాగే బాధితులతో పోలీసుల వ్యవహారశైలి ఎలా ఉండాలి అన్న దానిపై డీజీపీ దిశానిర్దేశం చేశారు
పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పట్టే ప్రమాదం ఉంది
కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానికి మార్పు, పరివర్తనే ముఖ్య అజెండా అని.. గత సంవత్సర కాలంగా అదే ఆలోచనతో పని చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో పోలీసుల సర్వీసులో చాలా మంచి పేరు తెచ్చుకున్నామని , పోలీసుల సేవలు అభినందనీయమని కొనియాడారు. అయితే.. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసుల వల్ల కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డారని.. దీని కారణంగా ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని ప్రజలు తప్పు పట్టే ప్రమాదం ఉందన్నారు. సామాన్యుల పట్ల ప్రవర్తించిన కొందరు పోలీసులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, నేరం చేసిన వారు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ కచ్చితంగా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.పొలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జరగాలని, పోలీసులపై సామాన్యుడికి గౌరవం పెరగాలని, నేరస్థులు భయపడాలని అన్నారు.
ప్రతీ పోలీసు స్టేషన్లో మార్పు కనిపించాలి
పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం.. కానీ తప్పదని అన్నారు డీజీపీ. ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరమని, మార్పు కోసం చేయాల్సింది చాలా ఉందని అన్నారు. “మనం అందరం కలిసి మార్పు కోసం ప్రయత్నిద్దాం.. ప్రభుత్వం, ప్రజలు మనకు బాధ్యత అప్పజెప్పారని టీం అందరికీ అర్ధమౌతుందని అనుకుంటాను. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు నెలలు ఓరియంటేషన్ క్లాసులకు అటెండ్ అవ్వాలి. మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలి. పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా రిసీవ్ చేసుకొవాలి. పోలీసు స్టేషనుకు వచ్చేవారితో మన ప్రవర్తన స్టేషనులో కనిపించాలి. సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలి” అని గౌతమ్ సవాంగ్ అన్నారు.
పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమే
ఏడీజీపీ, సీఐడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టు సెక్షన్ 4 ప్రకారం సంబంధిత అధికారి కూడా నేరస్ధుడేనని అన్నారు. పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమేనన్నారు. సమస్యతో వచ్చిన వారితో దుర్భాషలాడకూడదన్నారు. అవతలి వ్యక్తిని తమతో సమానంగా గౌరవించలేని మనస్తత్వం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఇకపై సాక్షుల వద్ద తీసుకునే వివరాలు 161crpc ప్రకారం వీడియోగ్రాఫ్ తీసుకుంటామని అన్నారు.