
హైదరాబాద్, వెలుగు: సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతున్నది. కిడ్నీ మార్పిడీల్లో కీలకంగా వ్యవహరించిన అనస్థీషియాలజిస్ట్ రుట్టల వెంకట రామ సంతోష్ నాయుడు(36)ను సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏపీ ఏలూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వెంకట రామ సంతోష్ నాయుడు 24 వ నిందితుడు కాగా ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐడీ చీఫ్ చారుసిన్హా శుక్రవారం పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
కిడ్నీ మార్పిడి వ్యవహారంలో హాస్పిటల్ నిర్వాహకులు, డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. సమగ్ర దర్యాప్తు కోసం కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందని చెప్పారు. ఈ మేరకు ఏపీ పోలీసులతో కలిసి రాష్ట్ర సీఐడీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారని వెల్లడించారు.
కిడ్నీ మార్పిడీల్లో ప్రధాన నిందితులైన అలకనంద డాక్లర్లు రాజశేఖర్, అవినాష్‌తో కలిసి విశాఖపట్నం మురళీనగర్‌కు చెందిన అనస్థీషియాలజిస్ట్ వెంకట రామ సంతోష్ నాయుడు కీలకంగా వ్యవహరించాడని వివరించారు. డోనర్లు, గ్రహీతలకు ఆపరేషన్ల సమయంలో అనస్థీషియా ఇచ్చేవాడన్నారు. ఈ కేసులో మూడవ నిందితుడైన పవన్ కుమార్ సంతోష్‌ను ఎంగేజ్ చేసేవాడని.. ఒక్కో సర్జరీకి రూ.2.5 లక్షలు వసూలు చేసేవాడని చారుసిన్హా పేర్కొన్నారు.