సీఎం జగన్​తో మాజీ మంత్రి బాలినేని భేటి... 

సీఎం జగన్​తో మాజీ మంత్రి బాలినేని భేటి... 

ఉమ్మడి ప్రకాశం జిల్లా నేత, మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 40 నిమిషాలు   భేటీ అయ్యారు.  కొంత కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అసంతృప్తితో ఉన్ననేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం మీడియా కంట పడకుండానే ఎయిర్​పోర్ట్​కు వెళ్లారు.

కొన్నాళ్లుగా అసంతృప్తి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదు.  ఆయన  గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ బాలినేనిపై పార్టీ హైమాండ్​కు ఫిర్యాదులు వెళ్లాయి.

చిలికి చిలికి గాలివానగా... 

ఇటీవల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో అలిగిన బాలినేనిని పార్టీ పెద్దలు సముదాయించి సీఎం జగన్‌తో మాట్లాడించి శాంతింపజేశారు. ఇప్పుడు ఆయన తన ప్రాంతీయ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి మరోమారు వార్తల్లోకెక్కారు. బాలినేని నుండి వచ్చిన ఊహించని ఈ పరిణామంతో అధిష్టానం ఆశ్చర్యానికి గురైంది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల్లో ఆయనకు మంచిపట్టు ఉంది. దీంతో ఆయన్ను బుజ్జగించి శాంతింపజేసేందుకు అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు. ఈక్రమంలోనే అధిష్టానం నుంచి ఆయనతో రాయబారం సాగించింది. పార్టీ తరపునుండి ఇద్దరు పెద్దలు ఆయనతో మంతనాలు జరిపారు.  ఈనేపథ్యంలోనే సోమవారం (మే1)న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బాలినేనికి ఫోన్‌ వెళ్లినట్లు సమాచారం. కానీ, బాలినేని తన ఆలోచన మార్చుకోవటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.  తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని.. కేవలం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటున్నట్లు బాలినేని పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్నారని తెలుస్తోంది.