ఉత్తరాంధ్రకూ గోదావరి నీళ్లు..మరో మళ్లింపు పథకానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

ఉత్తరాంధ్రకూ గోదావరి నీళ్లు..మరో మళ్లింపు పథకానికి ఏపీ గ్రీన్ సిగ్నల్
  • పాత ప్రాజెక్టు పేరుతో మళ్లింపు పథకం చేపడుతున్న ఏపీ
  • తెలంగాణ ప్రాజెక్టులపై అడుగడుగునా కొర్రీలు

హైదరాబాద్, వెలుగు: ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి నది నీళ్ళ ను  మళ్లించుకునేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చేపట్టనున్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆ రాష్ట్ర బడ్ట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పేరిట పనులు పట్టాలెక్కించనుంది. దీని ద్వారా గోదావరి నీళ్లను  వంశధార, నాగావళి బేసిన్లకు తరలించుకు పోనుంది. పాత ప్రాజెక్టు అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పేరిట మొదలు పెడ్తున్నఏపీ.. మరోవైపు తెలంగాణ పాత ప్రాజెక్టులకు మాత్రం అడుగడుగునా అడ్డుతగులుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకన్నా వెనుకబడ్డపాలమూరు, నల్గొండ ప్రాజెక్టులను ఆపేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది.

త్వరలోనే టెండర్లు ..

పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే పనులకు త్వరలో టెండర్లప్రక్రియ చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.  రూ.15,488 కోట్లతో 63.2 టీఎంసీల నీటిని మళ్లించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రేటర్ విశాఖతో పాటు మూడు జిల్లాలకు తాగు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే టెండర్లప్రక్రియ పూర్తి చేసిన తొలిదశ పనులను త్వరగా ప్రారంభించాలని వాటర్ రీసోర్సెస్ అధికారులను ఆ రాష్ట్ర సీఎం తాజాగా ఆదేశించినట్టు తెలిసింది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్కీం కథ ఇదీ..
పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటిని అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2009లోనే అప్పటి సీఎం వైఎస్ రాజ శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టినా పనులు మొదలుకాలేదు. మళ్లీ 2018లో అవే పనులకు రూ.2,022 కోట్లతో టెండర్లు పిలిచారు. అయినప్పటికీ పనులు మొదలు కాలేదు. వర్క్ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం.. పోలవరం ఎడమ కాల్వ నుంచి లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి పంపుహౌస్ లు, పెదపూడి రిజర్వాయర్ పనులు చేపట్టాలి . 2009 లో ఈ పనులకు మాత్రమే శంకుస్థాపన చేసినట్టు తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. శ్రీకాకుళం వరకు ప్రాజెక్టు విస్తరించాలని అప్పట్లో భావించినప్పటికీ.. తొలిదశకు సంబంధించి మాత్రమే ప్రక్రియ మొదలు పెట్టారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున నీటి తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.
గోదావరి నీళ్ల మళ్లింపు ఇలా..
  • గోదావరిలో వరద ఎక్కువగా ఉండే 90 రోజుల్లో రోజుకు 8 వేల క్యూ సెక్కుల చొప్పున 63.2 టీఎంసీల నీళ్లను ఉత్తరాంధ్ర జిల్లాలకు మళ్లి స్తారు. పోలవరం ఎడమ కాల్వ162.40 కిలోమీటర్ పాయింట్ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని లింక్ కెనాల్ ద్వారా జామద్దులగూడెం పంపుహౌస్ కు అక్కడి నుంచి పెదపూడి పంపుహౌస్ కు తరలిస్తారు. 3.16 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన పెదపూడి రిజర్వాయర్ లో నీటిని 1.30 లక్షల ఎకరాలకు అందిస్తారు.
  • పోలవరంఎడమ కాల్వ162.40 కిలోమీటర్ పాయింట్ నుంచే మరో లింక్ కెనాల్ ద్వారా 6,700 క్యూసెక్కులను 23 కిలోమీటర్ల దూరంలోని పాపాయపాలెం పంపుహౌస్ కు తరలిస్తారు. అక్కడ ఎత్తిపోసి 106 కిలో మీటర్లదూరంలోని గాదిగెడ్డ రిజర్వాయర్ కు తరలిస్తారు. ఈ కాల్వపై 102 కిలోమీటర్ పాయింట్ వద్ద పంపుహౌస్ లో నీటిని ఎత్తి పోసి కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీళ్లు తీసుకెళ్తారు.
  • 106 కిలోమీటర్లకాల్వపై 14వ కిలోమీటర్ పాయింట్ వద్దభూదేవి పంపుహౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి.. భూదేవి రిజర్వాయర్ ( 6.20 టీఎంసీలు) నింపుతారు.కాల్వ 48.50 కిలోమీటర్ పాయింట్ వద్ద మరో పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి వీరనారాయణపురం (3.55 టీఎంసీలు)రిజర్వాయర్ ను నింపుతారు. 73 కిలోమీటర్ పాయింట్ వద్ద తాడిపూడి లిఫ్ట్ద్ ద్వారా నీటిని ఎత్తిపోసి తాడిపూడి రిజర్వాయర్ (3.80 టీఎంసీలు) నింపుతారు. వీటి పరిధిలోని 6.70 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు.
  • మొత్తంగా రూ.15,488 కోట్లతో చేపట్టే ఈ స్కీం ద్వారా తరలించే 63 టీఎంసీల్లో ఉత్తరాంధ్ర పారిశ్రామిక అవసరాలకు 5.53 టీఎంసీలు కేటాయించారు. భవిష్యత్లో ఇండస్ట్రీస్ కు నీటి కష్టాలు ఎదురవకుండా జాగ్రత్త తీసుకున్నారు.

వాటా తేలకుండానే.. ఏకపక్షంగా..

సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే తప్పు కాదని.. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేలకుండానే ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్టులు చేపడుతోందని మన రాష్ట్ర ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర స్కీంలో తొలిదశ పనులు మాత్రమే గతంలో చేపట్టినవని, విస్తరణ పనులను కొత్తవాటినేగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్తున్నారు . తెలంగాణ పాత ప్రాజెక్టుల విషయంలో అడుగడుగునా కొర్రీలు పెడుతోన్న ఏపీ.. తన ప్రాజెక్టులు మాత్రం 2009, అంతకుముందువనే చెప్తోందని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ అవసరాల మేరకు పాత ప్రాజెక్టుల్లో కొద్దిపాటి చేర్పులు, మార్పులు చేస్తారన్న పట్టువిడుపులు లేకుండా.. ఏపీ అన్ని వ్యవస్థలకు ఫిర్యాదులు చేస్తోందని స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు మిగులు జలాల్లో వాటా తేలేవరకు ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్లు కోరుతున్నారు.