
ఏపీలోని కూటమి సర్కార్ మరో పధకం ప్రారంభించింది. శనివారం ( అక్టోబర్ 4 ) ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పధకం ప్రారంభించింది ప్రభుత్వం. ఈ పధకం కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఈ పధకం ప్రారంభించడం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు ఉండవల్లి నుంచి సింగ్ నగర్ కు చేరుకున్నారు.
ఈ క్రమంలో విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.ఈ పధకం ద్వారా ఆటో, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ సేవలో పధకం ద్వారా ఏపీలోని ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందనుంది.తొలి ఏడాది 2 లక్షల 90వేల 669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పధకం ద్వారా రెండు లక్షల 64 వేల మంది ఆటో డ్రైవర్లు, 20 వేల 72 మంది ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ది చేకూరనుంది.