గుండెపోటు మరణాలు.. ఏపీలో రూ. 40 వేల ఇంజక్షన్‌‌ ఫ్రీ

గుండెపోటు మరణాలు..  ఏపీలో రూ. 40 వేల ఇంజక్షన్‌‌ ఫ్రీ
  • గుండెపోటు మరణాల నివారణపై జగన్  సర్కారు ప్రత్యేక దృష్టి
  • సీఎం ఆదేశాలతో స్టెమి ప్రాజెక్టుకు శ్రీకారం
  • గోల్డెన్  అవర్‌‌లో ప్రాణం నిలపడమే ప్రధాన లక్ష్యం
  • చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలో పైలట్‌‌ ప్రాజెక్టు
  • వచ్చే నెల 29 నుంచి కార్యక్రమం ప్రారంభం

అమరావతి: గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటిగంటలోనే (గోల్డెన్  అవర్) అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి  ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. ఇందు కోసం ఇండియన్ కౌన్సిల్  ఆఫ్  మెడికల్  రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో స్టెమి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ప్రిన్సిపల్  సెక్రటరీ (వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

గుండెపోటు సంభవించిన వ్యక్తికి తొలి 40 నిమిషాలు ఎంతో కీలకమైనందున ఆ సమయంలో రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడటమే స్టెమి ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందుగా గ్రామ స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందిస్తారు. సమీపంలో ఉన్న పీహెచ్ సీలలో ఇనీషియల్ట్రీట్మెంట్ ఇస్తారు. గోల్డెన్ అవర్ లో రోగికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ను ఉచితంగా అందిస్తారు. సాధారణంగా ఈ ఇంజెక్షన్  ఖరీదు రూ.40 వేలు. అనంతరం 100 కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్  హబ్  హాస్పిటల్ కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్రచికిత్స చేస్తారు. అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్  లాబ్స్ ను నిర్మించింది. గుంటూరు, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రులను హబ్స్ గా చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి హార్ట్ కేర్  సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చింది. 

ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం

రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్  ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టెమి పైలట్  ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల 29న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2024 జనవరి నుంచి ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఏం చేస్తారంటే..

గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలులో 16, గుంటూరులో 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తారు.