ఏపీలో కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్లు

ఏపీలో కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్లు
  • 14న కలెక్టరేట్ల ఎదుట నిరసనలకు నిర్ణయం
  • ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిరసనలు

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విద్యా విధానం (NEP) అమలు విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. అన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినా ముందుకు వెళుతోందని ఫ్యాప్టో (FAPTO) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తన ప్రయత్నాలు విరమించుకోవాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందని ఫ్యాప్టో పేర్కొంది. కొత్త విద్యా విధానంపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో 44 సంఘాలకు గాను 42 సంఘాలు వ్యతిరేకించాయని ఫ్యాప్టో గుర్తు  చేసింది. చివరకు శాసనమండలిలో తమ సభ్యుల ద్వారా వ్యతిరేకత తెలియజేసినా ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కితీసుకోకపోవడం సరికాదని ఫ్యాప్టో అభిప్రాయపడుతోంది.

గత్యంతరంలేక ప్రజాస్వామబద్దంగా తమ గొంతు వినిపించేందుకు ఆందోళనల బాట పట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దుందుడుకుగా ముందుకు వెళ్లడాన్ని నిరసిస్తూ ఈ నెల 14 వ తేదీన జిల్లా కలెక్టర్ వారి కార్యలయం ముందు ఫ్యాప్టో పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు ఇచ్చింది. అలాగే 16న బ్లాక్ బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు తెలియజేయాలని తీర్మానం చేసింది. ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో ఛైర్మన్‌ సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, జనరల్ సెక్రటరీ సీహెచ్.శరత్ చంద్ర, కార్యదర్శి కె.ప్రకాష్ రావు తదితరులు పిలుపునిచ్చారు.