ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. సీఆర్డీయే రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసిందన్నారు. దీనిపై ఇవాళ అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. బిల్లు వెనక్కి తీసుకుంటే.. అమరావతియే రాజధానిగా కొనసాగనుంది. త్రిసభ్య ధర్మాసనం ముందు వివరాలు నివేదించారు ఏపీ అడ్వకేట్ జనరల్.

మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం అయ్యింది. అయితే కేబినెట్ భేటీ అనంతరం రాజధాని అంశంపై మంత్రులెవరూ స్పందించలేదు. మీడియాతో ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రాజధాని అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టత ఇస్తారన్నారు. మరోవైపు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.