పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ రూటు మార్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడో దశలో బనకచర్లను తప్పించి.. నల్లమలసాగర్‌కు నీటిని తరలించాలని కొత్త ప్లాన్ వేసింది. ఇప్పుడు ఎలాగూ బనకచర్లకు శ్రీశైలం నుంచి నీటిని దొడ్డిదారిలో తరలించుకుపోతున్న ఏపీ.. ఇప్పుడు అదే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగమైన నల్లమల సాగర్‌కు పోలవరం నుంచి నీటిని తరలించేందుకు ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను కాస్తా.. పోలవరం –నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుగా మార్పు చేసింది. తద్వారా ఇటు కృష్ణా నుంచి బనకచర్లకు.. అటు గోదావరి నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లను తన్నుకుపోయే కుట్రలకు తెరలేపింది. బనకచర్ల ప్రాజెక్ట్‌లో భాగంగా 200 టీఎంసీలను తరలించాలనుకున్న ఏపీ.. ఇప్పుడు పోలవరం –నల్లమలసాగర్ లింక్‌లోనూ అంతే మొత్తంలో నీటిని తరలించుకుపోనుంది
తొలి రెండు దశలూ సేమ్ టు సేమ్..
పోలవరం–బనకచర్ల లింక్‌లో భాగంగా పోలవరం కుడి కాల్వ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి ఒక దశలో నీటిని తరలించాలని ఏపీ గతంలో ప్లాన్ వేసింది. అక్కడి నుంచి రెండో దశలో నాగార్జునసాగర్‌కుడి కాల్వలోకి.. అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి నీటిని ఎత్తిపోయాలని భావించింది. ఇక, మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు నీటిని తరలించాలని ప్లాన్ చేసింది. గత నెలలో డీపీఆర్ తయారీకి టెండర్లనూ పిలిచింది. కానీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇటీవలే ఆ టెండర్లను ఏపీ ఉపసంహరించుకున్నది. అయితే, టెండర్లను వాపస్ తీసుకున్న ఏపీ.. దాని వెనుక మరో గూడు పుఠానీకి పాల్పడింది. పీబీ లింక్‌లోని తొలి రెండు దశలను అలాగే వాడుకుని.. మూడో దశను స్కీమ్ నుంచి ఎత్తేసింది. అందుకు అనుగుణంగా రెండో దశ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించేలా కొత్త ఎత్తుగడను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు నీటి తరలింపునకు సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసేలా టెండర్లను పిలిచింది.
అప్పట్లోనే..
వాస్తవానికి 1995లోనే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును చేపట్టింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా 3 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టిన ఆ ప్రాజెక్టు కెపాసిటీని 2005లో 11,500 క్యూసెక్కులకు పెంచింది. ఇక్కడి నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించాలనే ప్రతిపాదన ఉండేది. అయితే, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలం నుంచి జలదోపిడీపై ఫిర్యాదులూ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బనకచర్లను విరమించుకుని బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని మళ్లించాలనేది ఏపీ ప్లాన్‌గా చెబుతున్నారు. బనకచర్ల లింక్‌లో భాగంగా రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 200 టీఎంసీల నీటిని తరలించాలని ప్లాన్ వేసిన ఏపీ.. ఇప్పుడు పోలవరం–నల్లమలసాగర్ లింక్‌లోనూ రోజూ 2 టీఎంసీల చొప్పున నీటిని తరలిస్తామని స్పష్టం చేసింది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యం యథావిధిగా150 టీఎంసీలను అలాగే ఉంచింది. మొత్తంగా ఈ ప్రాజెక్టును రూ.59 వేల కోట్లతో చేపట్టనున్నట్టు సమాచారం. ఇక, భవిష్యత్‌లో నల్లమలసాగర్ నుంచి బనకచర్లకూ విస్తరించే అవకాశాలూ ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటికే ఉన్న ప్రతిపాదనలే కాకుండా.. మరో ప్రతిపాదననూ ఏపీ తెరపైకి తీసుకొచ్చింది. సెగ్మెంట్1లో భాగంగా భోలేరావ్ ట్యాంక్ నుంచి వైకుంఠపురానికి టన్నెల్, ఆక్విడక్ట్ ద్వారా నీటి తరలింపుపైనా డీపీఆర్ స్టడీ చేయాలని టెండర్ డాక్యుమెంట్లలో ఏపీ పేర్కొంది. దాంతో పాటు సెగ్మెంట్3లో లింక్ కెనాల్ నిర్మాణంపైనా స్టడీ చేయాలని తెలిపింది.
