నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే

నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే
  •     ఇప్పటిదాకా కృష్ణాలో 771.25 టీఎంసీల వినియోగం
  •     74.27 శాతం నీళ్లను వాడేసుకున్న పొరుగు రాష్ట్రం
  •     తాజాగా కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖతో తేటతెల్లం
  •     మనం వాడింది 267 టీఎంసీలే.. ఇంకా 105 టీఎంసీలు బ్యాలెన్స్​
  •     కృష్ణాలో ఉన్నవన్నీ తమ నీళ్లేనని బోర్డుకు తెలంగాణ లేఖ


హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది కృష్ణా నదిలో ఏపీ రికార్డ్ స్థాయిలో నీటిని తీసుకెళ్లిపోయింది. ఎన్నడూ లేనంతగా 771.252 టీఎంసీల జలాలను కృష్ణా ప్రాజెక్టుల నుంచి తోడేసుకున్నది. ఇది తాత్కాలిక ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న వాటా కన్నా అధికం కావడం గమనార్హం. కోటాలో 66 శాతం నీళ్లను వాడుకోవాల్సి ఉన్నా.. 74.27 శాతం నీళ్లను ఏపీ తరలించుకుపోయింది. అదే సమయంలో తెలంగాణ 25.77 శాతం వాటాతో 267.733 టీఎంసీల జలాలనే వినియోగించుకున్నది. తాగు నీటి అవసరాల కోసం తాజాగా కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ జనరల్ పెట్టిన ఇండెంట్​లో ఈ విషయం వెల్లడైంది. ఇప్పుడున్న నీళ్లన్నీ తమవేనని పేర్కొంటూ కృష్ణా బోర్డు చైర్మన్​కు మూడు రోజుల క్రితం ఈఎన్​సీ లేఖ రాశారు. ఏపీ వాటా మొత్తం అయిపోయిందని, వాటాకు మించి వాడుకున్నదని ఈఎన్​సీ లేఖలో ఘాటుగా పేర్కొన్నారు. 

ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలంలలో తమకింకా 105.221 టీఎంసీల జలాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కనుక సాగర్​లో 13 టీఎంసీలు, శ్రీశైలంలో ఉన్న 5 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీలను మే నెల తాగునీటి అవసరాలకు కేటాయించాలని లేఖలో డిమాండ్​ చేశారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా తాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. ఇక సాగర్ నుంచి తీసుకునే నీటి ద్వారా హైదరాబాద్​ సిటీ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని పేర్కొన్నారు. మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ నీటినే పొదుపుగా వాడుకుంటే మంచిదని హితవు చెప్పారు. ఇప్పటికే ఏపీ తన కోటాకు మించి 38 టీఎంసీలు ఎక్కువ నీటిని ఈ ఏడాది వినియోగించుకున్నదని, ఇకపై కామన్​ రిజర్వాయర్ల నుంచి ఏపీ నీటిని తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి నీటిని విడుదల చేస్తే.. తెలంగాణలోని కరువు ప్రాంతాలకు నీటి సంక్షోభం ఏర్పడుతుందని, కనుక ఏపీకి నీళ్లు ఇవ్వొద్దని కోరారు.

మీటింగ్​ డేట్​ చెప్పండి.. ఈఎన్​సీలకు బోర్డు లేఖ

సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తామని ఇటీవలే కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీటిని తీసుకెళ్లి స్టోర్ చేసుకున్న పొరుగు రాష్ట్రం.. మళ్లీ ఇప్పుడు నీళ్లు అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా తెలంగాణ కూడా ఏపీకి కౌంటర్ ఇవ్వడంతో రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. రెండు రాష్ట్రాలకూ తాగునీటి అవసరాల కోసం ఇండెంట్ పెట్టిన నేపథ్యంలో.. త్రీ మెంబర్ కమిటీ మీటింగ్​ను ఏర్పాటు చేస్తామని లేఖలో పేర్కొంది. మీటింగ్​కు అనువైన తేదీని చెప్పాలని రెండు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. కాగా, ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో కలిపి 199 టీఎంసీల నీళ్లుండగా.. అందులో వాడుకునేందుకు (డెడ్ స్టోరేజ్​కు పైన) వీలుగా 33.10 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 39.375 టీఎంసీల స్టోరేజ్ ఉండగా.. అందులో వాడుకోవడానికి వీలుగా డెడ్​స్టోరేజ్ 834 అడుగులకుపైన 5.08 టీఎంసీల జలాలున్నాయి. సాగర్ ప్రాజెక్టులో 159.686 టీఎంసీలకుగానూ.. డెడ్​స్టోరేజ్​కు ఎగువన 28.017 టీఎంసీలున్నాయి.

మరిన్ని వార్తలు