సినీ, రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా ఆసక్తి రేకెత్తిస్తున్న డిప్యూటీ సీఎం వర్సెస్ యాక్టింగ్ వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ తన సినిమాలను కొనసాగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ 2025 ఆగస్టు 19న పిల్ (PIL) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్లలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు.
పవన్ నటనకు లైన్ క్లియర్..
అయితే, ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒక ప్రజా ప్రతినిధి తన వృత్తిని (నటన) కొనసాగించకుండా అడ్డుకోవడానికి ఎటువంటి చట్టపరమైన , రాజ్యాంగపరమైన నిబంధనలు లేవు అని కోర్టు స్పష్టం చేసింది. కేవలం నైతిక కారణాలను చూపుతూ ఒక వ్యక్తి వృత్తి స్వేచ్ఛను హరించలేమని ధర్మాసనం పేర్కొంది. ఒక మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నంత కాలం, ఖాళీ సమయంలో సినిమాలు చేసుకోవడం వ్యక్తిగత విషయమని ప్రభుత్వం కోర్టులో వాదించింది.
వృత్తి స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు..
ఇరువురి వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ నిధులు, యంత్రాంగం దుర్వినియోగం అయ్యాయని పిటిషనర్ సరైన ఆధారాలు చూపలేకపోయారని అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం కల్పించిన వృత్తి స్వేచ్ఛను ప్రజా ప్రతినిధులు కూడా కలిగి ఉంటారని, వారు ఆదాయం పొందే ఇతర మార్గాలపై పూర్తి నిషేధం విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది.పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మేకప్ వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
అభిమానుల్లో ఆనందం..
హైకోర్టు తీర్పు పట్ల పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే సినీ పరిశ్రమకు ఆయన వెన్నుముక అని వారు వాదిస్తున్నారు. మరోవైపు, రాజకీయ ప్రత్యర్థులు వేసిన అడ్డంకులు తొలగిపోవడంతో పవన్ ఇకపై 'రెండు పడవల ప్రయాణం' కాకుండా, రెండు రంగాల్లోనూ తన ముద్ర వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయింది.' ధురంధర్ 2' దాటికి కలెక్షన్ల తగ్గాయి. ఇప్పటి వరకు రూ.90 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
