టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇటీవల ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది కోర్టు. ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యి బాధిత మహిళ ఫిర్యాదు వెనక్కి తీసుకోవటంతో కేసు క్లోజ్ అయ్యింది.
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని ఆదిమూలం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దంటూ ఆదేశించింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించటం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లొంగదీసుకున్నారంటూ సత్యవేడు టీడీపీకి చెందిన మహిళా నేత ఆరోపించారు.
తిరుపతిలోని ఓ హోటల్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ వీడియో ఆధారాలతో సహా బయటపెట్టింది బాధితురాలు. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానని అప్పట్లో ఆ మహిళ ఆరోపించారు. దీనిపై తిరుపతి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఇప్పడు ఈ కేసు ఊహించని రీతిలో క్లోజ్ అవ్వటంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.