రాష్ట్ర పోలీసులను తాకిన ఏపీ గంజాయి సెగ!

రాష్ట్ర పోలీసులను తాకిన ఏపీ గంజాయి సెగ!

నల్గొండ, వెలుగు:  ఏవోబీ(ఆంధ్ర–ఒడిశా బార్డర్)​లో ఈ నెల 15 నుంచి 17 వరకు నల్గొండ పోలీసులు చేపట్టిన  ‘ఆపరేషన్ గంజా’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటన తర్వాత ఏపీలో  రూలింగ్​పార్టీకి, టీడీపీకి నడుమ  మొదలైన వార్​పీక్స్​కు చేరింది. తాజాగా ఇప్పుడీ వివాదం కాస్తా నల్గొండ జిల్లా పోలీసులనూ తాకింది. ముఖ్యంగా ఏఓబీలో ఆపరేష న్​గంజా కి   నేతృత్వం వహించిన డీఐజీ ఏవీ రంగనాథ్ పై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చేసిన ఆరోపణలు హాట్​టాపిక్​గా మారాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లా పోలీస్​ఆఫీసర్​మాజీ సీఎం చంద్రబాబుకు, టీడీపీకి దగ్గరగా ఉంటారని విజయ సాయిరెడ్డి  ఆరోపించారు. దీంతో విజయ సాయిరెడ్డి కామెంట్స్​ను ఖండిస్తూ డీపీజీ రంగనాథ్​ గురువారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు.  ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు ఎందుకు పెరిగాయో చెబుతూ డీఐజీ ప్రస్తావించిన అంశాలు మరింత ఆసక్తికరంగా మారాయి.  సాయిరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ పోలీస్ డిపార్ట్​మెంట్​ఒకింత గుర్రుగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి పర్మిషన్, ఏపీ పోలీసుల సహకారం​వల్లే నల్గొండ పోలీసులు ఏవోబీలో దాడులు చేశారు.  తీరా ఇప్పుడు ఏపీ రూలింగ్​ పార్టీకి చెందిన కీలకమైన ఎంపీ.. నల్గొండ జిల్లా పోలీసులను విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖండించకపోవడంపై పోలీస్​ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. గంజాయి స్మగ్లర్లతో ప్రాణాలకు తెగించిన పోరాడిన పోలీసులకు రాజకీయ రంగు పులమడం ఎంతవరకు సమజంసం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
అప్పుడు సహకరించి.. ఇప్పుడు ఆరోపణలు.. 
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునే క్రమంలో నల్గొండ జిల్లా పోలీసులు సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో బస్సులు, రైళ్లు, ఇతర వెహికల్స్​లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వేల కిలోల గంజాయి ఏవోబీ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి, 35 మందిపై కేసులు పెట్టారు. నిందితుల కాల్​డేటా, వారి నుంచి సేకరించిన పక్కా ఆధారాలతో తెలంగాణ సర్కారు, రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్​ ఉన్నతాధికారుల పర్మిషన్​ తీసుకొనే ఏవోబీ లోకి అడుగుపెట్టారు.  ఈ నెల 15న నల్గొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ టీమ్​లు ‘ఆపరేషన్ గంజా ఇన్ ఏవోబీ’ ప్రారంభించాయి. వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు  ఉండి విశాఖ రూరల్ ఎస్పీ సపోర్ట్​తో గంజాయి స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి.  ఈ నెల 17న చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద  పోలీస్ టీమ్స్, గంజాయి స్మగ్లర్ల మధ్య జరిగిన ఎదురుదాడుల్లో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్​లో వెయ్యి కిలోల గంజాయితోపాటు, 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. తీరా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. రూలింగ్​పార్టీ వైఎస్సార్​సీపీ లీడర్లు, టీడీపీ లీడర్ల మధ్య తిట్ల దండకం ముదిరి, టీడీపీ ఆఫీసులపై దాడుల దాకా వెళ్లింది. ఇప్పుడు ఈ పంచాయితీ కాస్తా ఢిల్లీకి చేరి కాకరేపుతోంది. ఈతరుణంలో రూలింగ్​ పార్టీకి చెందిన కీలక ఎంపీ, ఏపీ సీఎం జగన్​కు అత్యంత సన్నిహతుడైన విజయసాయిరెడ్డి నల్గొండ డీఐజీ రంగనాథ్​ను టార్గెట్​ చేయడం, చంద్రబాబుకు అనుకూలంగా ఏవోబీ దాడులు చేశాడనే అర్థం వచ్చేలా మాట్లాడడం గమనార్హం.
రాజకీయాల్లో పోలీసులను ఇరికించడం సరికాదు
- ఏపీలోని పొలిటికల్​ పార్టీలు గంజాయి ఆపరేషన్ విషయంలో చేస్తున్న రాజకీయాల్లోకి పోలీసులను, ప్రత్యేకించి నన్ను లాగడం సరికాదు. ఏవోబీలో గంజాయి సమస్య 15 ఏండ్లుగా ఉన్నదే. ముఖ్యంగా వైజాగ్​ రూరల్, తూర్పుగోదావరి, మల్కాన్ గిరి జిల్లాల అటవీ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో అక్కడి గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగింది. ఉపాధి కోల్పోయిన చాలా మంది వ్యసనాలకు బానిసయ్యారు. గంజాయి అక్రమ రవాణాను ఉపాధిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గంజా చేపట్టాం.. తప్ప మాకేమీ రాజకీయ ఉద్దేశాలు లేవు. బాధ్యత కలిగిన నేతలుగా గంజాయిని అన్ని స్థాయిల్లో నిర్మూలించేందుకు, దేశ భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేయాలి. గంజాయి స్మగ్లర్లు ఏవోబీలోనే కాదు కశ్మీర్ లో ఉన్నా పట్టుకొని శిక్ష పడేలా చూస్తాం.                   - ఏవీ రంగనాథ్, డీఐజీ, నల్గొండ