
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం( ఆగస్టు 11) నిప్పులు చెరిగారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగిదేమీ లేదన్నారు .
సత్తెనపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ఒక రోజులో ముగించేశాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అయితే పాదయాత్రలో లోకేష్ తన పై చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే, ఒక మంత్రిగా ఉండగానే ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. ముందు ఎమ్మెల్యేగా గెలవాలని లోకేశ్ కు అంబటి సవాల్ విసిరారు. నారా లోకేశ్ తన స్థాయికి మించి మాట్లాడి వికృతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేశాడని అన్నారు. తాను ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నానని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు మంత్రి అంబటి. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని, లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే లోకేశ్, ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మండిపడ్డారు.
నీ బతుకేంటో చూసుకో లోకేశ్
తనను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పగలు వాగి, రాత్రి గోకుతానంటూ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్దరహితమని పేర్కొన్నారు. తాను గోకిన వ్యక్తులు లోకేష్ కు ఏమైయినా చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి కూడా తాను విమర్శలు చేస్తానని అయితే అవన్నీ లోకేష్ కు వాగుడుగా అనిపిస్తున్నాయని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలతో కలసి సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ నాడు డాన్స్ చేశానని అయితే లోకేష్ తరహాలో క్లబ్ డాన్స్ లు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేని కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా సరైన విమర్శలు చేయలేని పరిస్థితుల్లో లోకేష్ ఉన్నాడని అంబటి వ్యాఖ్యానించారు.
కన్నాపై అంబటి ఫైర్
మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడని కన్నా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. జగన్ తండ్రి పేరును మరింత ముందుకు తీసుకెళ్తున్న కుమారుడని కితాబిచ్చారు. జగన్ లా పట్టుదలతో రాజకీయాలు చేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి అయిన వారెరవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. . వైఎస్ కేబినెట్లో పనిచేసిన కన్నా .... జగన్‌ను విమర్శించడం విడ్డూరమన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే తత్వం కన్నాది అని ఆరోపించారు. మంచి అవకాశం వస్తే రేపు టీడీపీని కూడా వదిలేస్తాడని విమర్శించారు..