కేటీఆర్ కామెంట్లకు కౌంటర్లు

కేటీఆర్ కామెంట్లకు కౌంటర్లు

కేటీఆర్ కామెంట్లకు కౌంటర్లు

హైదరాబాద్‌‌, వెలుగు : టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌ ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. తమ ప్రభుత్వం గొప్పలను చెప్పుకునే క్రమంలో ఇతర రాష్ట్రాలపై చిన్నచూపు కామెంట్లు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. శుక్రవారం క్రెడాయ్‌‌ ప్రాపర్టీ షో ప్రారంభం సందర్భంగా పక్క రాష్ట్రంలో కరెంట్‌‌ లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చేసిన కామెంట్లకు ఏపీ రాష్ట్ర మంత్రులు స్పందించారు. క్రెడాయ్‌‌ ప్రాపర్టీ షోలో తమ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో పక్క రాష్ట్రంలో కరెంట్‌‌, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ తన ఫ్రెండ్​ చెప్పారన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఏపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు.  

వరుసగా రివర్స్.. 
ఇటీవలే కర్నాటక ప్రభుత్వంపైన కూడా కేటీఆర్​చేసిన కామెంట్స్‌‌పై ఇలాంటి రియాక్షనే వచ్చింది. కర్నాటక రాష్ట్ర సీఎంతో పాటు నెటిజన్‌‌ల నుంచి కేటీఆర్​ విమర్శలు ఎదుర్కొన్నారు.  బెంగళూరులో పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని ఓ ఇండస్ట్రియలిస్ట్‌‌ ట్వీట్‌‌ చేస్తే బ్యాగులు సర్దుకొని హైదరాబాద్‌‌కు వచ్చేయాలని కేటీఆర్‌‌ ట్విట్టర్‌‌లో సలహా ఇచ్చారు. అంతటితో ఆగకుండా సిలికాన్‌‌ వ్యాలీ ఆఫ్‌‌ ఇండియాగా పేరున్న బెంగళూరును అక్కడి ప్రభుత్వం ఆగం చేస్తుందన్నట్టుగా కామెంట్‌‌ చేశారు. దీనిపై కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్రంగా స్పందించారు. దేశంలో వస్తున్న ఎఫ్‌‌డీఐల్లో 40% కర్నాటకలోకే వస్తున్నాయని, ఇన్‌‌ఫ్రాస్ట్రక్షర్‌‌ సరిగా లేకుంటే వందలాది స్టార్టప్‌‌లు, రీసెర్చ్‌‌ సెంటర్‌‌లు బెంగళూరులో ఎందుకున్నాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. బీటీ సెక్టార్‌‌లో హెల్దీ కంటెస్ట్‌‌ ఉండాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని హితవు పలికారు. కర్నాటక మంత్రి సుధాకర్‌‌ దీనిపై స్పందిస్తూ అమెరికాలోని నగరాలు, సింగపూర్‌‌తో బెంగళూరు పోటీ పడుతోందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌‌తోనూ ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడం ఖాయమని అన్నారు. సంజయ్‌‌ పాదయాత్రను కార్నర్‌‌ చేసేం దుకు కేటీఆర్‌‌ చేసిన ప్రయత్నాలూ వివాదాస్పదమయ్యాయి. రాయచూర్‌‌ను తెలంగాణలో కలపాలని బీజేపీ ఎమ్మెల్యేనే డిమాండ్‌‌ చేస్తున్నారని కేటీఆర్‌‌ వ్యాఖ్యానించడం, దాన్ని అక్కడి ఎమ్మెల్యే శివరాజ్‌‌ పాటిల్‌‌ తోసిపుచ్చడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇటీవల సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌‌ దూరంగా ఉండాలని ప్రధాని ఆఫీస్‌‌ సమాచారం ఇచ్చిందని కేటీఆర్​ కామెంట్లు చేస్తే..   కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌‌ స్ట్రాంగ్‌‌ కౌంటర్‌‌ ఇచ్చారు. ఫిబ్రవరి 5న ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొనాల్సి ఉందని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని సీఎంవోనే సమాచారం ఇచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఏపీ మంత్రుల ఎదురుదాడి
కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రుల నుంచి గట్టి ఎదురుదాడి కొనసాగింది. ఏపీలో కరెంట్‌‌ లేదని ఎవరో చెప్పడం కాదని, తాను హైదరాబాద్‌‌ నుంచే వస్తున్నానని అక్కడ కరెంట్‌‌ లేకపోతే జనరేటర్‌‌ వేసుకొని వచ్చానని బొత్స కౌంటర్‌‌ ఇచ్చారు. తెలంగాణ నుంచి నాలుగు కాకపోతే 400 బస్సులు పంపుకోవచ్చని, ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఏపీ ప్రజలకు చూపించేందుకు తాము కూడా బస్సులు పెట్టి పంపిస్తామని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్‌‌ బదులిచ్చారు. సంక్షేమం, అభివృద్ధిలో తమ ప్రభుత్వమే దేశానికి ఆదర్శప్రాయంగా ఉందని మంత్రి జోగి రమేశ్‌‌ అన్నారు. 25 మంది కేబినెట్‌‌ మంత్రుల్లో17 మంది బడుగులే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బొత్సాకు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి కౌంటర్‌‌ ఇచ్చారు. తెలంగాణలో అసలు జనరేటర్లే లేవన్నారు. ఏపీలో రియల్‌‌ ఎస్టేట్‌‌ అస్సలే లేదని, అక్కడి మంత్రులు ఇక్కడికి వచ్చి బిజినెస్‌‌ చేస్తున్నారని తెలిపారు. బొత్సా కరెంట్‌‌ బిల్లు కట్టకపోతే కట్ చేసి ఉండొచ్చని ఎంపీ రంజిత్‌‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టే కేటీఆర్‌‌ ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చని సీనియర్‌‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

‘ఏపీ’ కామెంట్లపై కేటీఆర్ విచారం
ఏపీలో కరెంట్, నీళ్లు లేవంటూ చేసిన కామెంట్లపై శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో నేను చేసిన కామెంట్ల వల్ల ఏపీలోని నా స్నేహితులకు అనుకోకుండా బాధ కలిగింది. ఏపీ సీఎం జగన్ తో నాకు సోదర సమానమైన అనుబంధం ఉంది. ఆయన నాయకత్వంలో ఏపీ సుసంపన్నం కావాలి” అంటూ ట్వీట్ చేశారు.