బనకచర్ల డీపీఆర్కు ఏపీ నోటిఫికేషన్?

బనకచర్ల డీపీఆర్కు ఏపీ నోటిఫికేషన్?
  • ప్రాజెక్ట్ అసాధ్యమని సీడబ్ల్యూసీ, ఎన్​డబ్ల్యూడీఏ చెప్పినా వినట్లే
  • మొండిగా ముందుకెళ్తున్న ఏపీ
  • రూ.9.2 కోట్లతో డీపీఆర్ రెడీ చేసేలా నోటిఫికేషన్​

హైదరాబాద్, వెలుగు: పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్​పై ఏపీ మొండిగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్​ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) హైడ్రాలజీ లెక్కల్లో తేలినా ఏపీ వినిపించుకోవడం లేదు. తాజాగా ఆ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఏపీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిసింది. 

ప్రాజెక్ట్ డిజైన్​తో పాటు లిఫ్ట్​లు, టన్నెల్స్ కట్టే చోట ఇన్వెస్టిగేషన్స్ చేయడం, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా రిపోర్టు తయారు చేయాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నట్టు సమాచారం. రూ.9.20 కోట్లతో డీపీఆర్​ను తయారు చేయాల్సిందిగా అందులో మెన్షన్ చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​ను ఏపీ ఇప్పటికే పూర్తి చేసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 

ఓ నిర్మాణ సంస్థ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించినట్టు చెప్తున్నారు. అయితే, ఇప్పుడే డీపీఆర్​ను తయారు చేస్తున్నామని చెప్పేందుకే నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. 

కాగా, పోలవరం నుంచి బనకచర్ల వరకు నీటిని తరలించేందుకు ఏపీ ఈ ప్రాజెక్టును తలపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బొల్లాపల్లి వద్ద 170 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించాలని భావిస్తున్నది. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టి.. రాయలసీమకు నీటిని తరలించేందుకు కసరత్తు చేస్తున్నది.