గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ అధికారుల అభ్యంతరం

 గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ అధికారుల అభ్యంతరం

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ నిర్మించిన గూడెం ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వొద్దని, ఆ ప్రాజెక్టుతో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని జీఆర్‌‌ఎంబీని ఏపీ అధికారులు కోరారు. మంగళవారం జలసౌధలో జీఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు 14వ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌‌లో తెలంగాణ తరపున స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఈఎన్సీ మురళీధర్‌‌, ఏపీ నుంచి ఈఎన్సీ నారాయణ రెడ్డి, సీడబ్ల్యూసీ నుంచి వర్చువల్‌‌గా హైడ్రాలజీ డైరెక్టర్‌‌ నిత్యానందరాయ్‌‌, రెండు రాష్ట్రాల ఇంజనీర్లు పాల్గొన్నారు. గూడెం ఎత్తిపోతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వొద్దని ఏపీ ఈఎన్సీ 20 నిమిషాలపాటు వాదించారు. కడెం ప్రాజెక్టుకు 11.8 టీఎంసీలతో పర్మిషన్లు ఉన్నాయని, అంతకన్నా ఎక్కువ నీటినే తరలిస్తున్నప్పుడు కొత్తగా ఎత్తిపోతలకు అనుమతులు ఎందుకని ప్రశ్నించారు. దీనికి తెలంగాణ స్పెషల్‌‌ సీఎస్‌‌ అభ్యంతరం తెలిపారు. కడెం ప్రాజెక్టు జీ-5 (గోదావరి సబ్‌‌ బేసిన్‌‌ -5) పరిధిలో ఉందని, దీని ప్రభావం దిగువన చేపట్టే ఇతర ప్రాజెక్టులపై ఏమాత్రం ఉండబోదని సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతుల్లోనే స్పష్టంగా ఉందని వివరించారు. సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్‌‌ నిత్యానంద రాయ్‌‌ కూడా ఇదే విషయం తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 484.5 టీఎంసీలతో అనుమతులు ఇచ్చామని, దానిపై ఎలాంటి ప్రభావం పడకుండానే ఎగువ ప్రాజెక్టులకు పర్మిషన్‌‌ ఇస్తున్నామని తెలిపారు. ఏపీ ఈఎన్సీ జోక్యం చేసుకొని గతంలో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినపుడు తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని.. గూడెం ఎత్తిపోతలతో పాటు మోడికుంటవాగు ప్రాజెక్టుపై తాము లేవనెత్తిన అభిప్రాయాలను రికార్డు చేయాలని కోరారు.

మిగులు జలాలెన్నో తేలాలి

గోదావరిలో నీటి లభ్యతపై స్టడీ చేయించాలని, దీనికి రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో తెలంగాణ సీఎం కూడా ఆమోదం తెలిపారని ఏపీ ఈఎన్సీ తెలిపారు. నీటి లభ్యతపై అధ్యయనం చేయడానికి తమకు అభ్యంతరం లేదని, తమ సీఎం చెప్పింది గోదావరిలో మిగులు జలాలపై స్టడీ చేయాలని మాత్రమేనని తెలంగాణ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్ కుమార్  అన్నారు. మిగులు జలాలు ఎన్నో తేలితే సర్‌‌ ప్లస్‌‌ ఆధారంగా తాము చేపట్టిన ప్రాజెక్టులతో పాటు కేంద్రం తలపెట్టిన గోదావరి– కావేరి అనుసంధానం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌‌ జోక్యం చేసుకొని రెండు రాష్ట్రాల మధ్యనే నీటి లభ్యతపై స్టడీ చేయడం సాధ్యం కాదన్నారు. 1950 నుంచి 2021 వరకు రెయిన్ ఫాల్ ను బట్టి ఉమ్మడి ఏపీకి 1430 నుంచి 1480 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందన్నారు. ప్రతీ ఐదేండ్లకోసారి మూవింగ్​ అవైలెబులిటీ 1600 టీఎంసీల వరకు ఉంటుందన్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం కావాలంటే బోర్డు నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్‌‌కు లేఖ రాయాలని సూచించారు. 

మొదటి దశలో 5 టెలిమెట్రీ స్టేషన్లు

గోదావరిపై రాష్ట్రాల సరిహద్దుల్లోని 23 పాయింట్లలో టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా మొదటి దశలో ఐదు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెద్దవాగు, పెద్దవాగు కుడి, ఎడమ కాల్వలు, కిన్నెరసాని నదితో పాటు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని మరో వాగుపై టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అయ్యే ఖర్చును ఏపీ 85 శాతం భరిస్తే మిగతా 15 శాతం ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణకు చెరో రూ.5 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. బోర్డులో పనిచేసే ఉద్యోగులకు 25 శాతం ఇన్సెంటివ్‌‌లు ఇవ్వాలనే ప్రతిపాదనకు తెలంగాణ ఒప్పుకోగా.. ఏపీ ససేమిరా అంది.