కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్​కు ఏపీ డుమ్మా

కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్​కు ఏపీ డుమ్మా

బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని బోర్డుకు లేఖ

హైదరాబాద్, వెలుగు : కృష్ణ రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రీమెంబర్ కమిటీ మీటింగ్​కు ఏపీ మరోసారి డుమ్మా కొట్టింది. మంగళవారం నుంచి తమ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నందున మీటింగ్​కు రాలేమని, మరో తేదీన నిర్వహించాలని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి బోర్డుకు లేఖ రాశారు. జలసౌధలో బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్​పురే అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని ఏపీ తరలించుకుపోయిందని, ఇకనైనా నీళ్లు తీసుకోకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ మీటింగ్​కు రాకున్నా సమావేశం జరిగినట్టే పరిగణించి ఈమేరకు ఆ రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. త్రీమెంబర్ కమిటీ మీటింగ్​కు ఏపీ ఈఎన్సీ అటెండ్​కాకున్నా బోర్డుకు లేఖ రాశారు. 

619 టీఎంసీలు తరలించుకుపోయింది.. 

ఈ వాటర్ ఇయర్​లో ఫిబ్రవరి 28 వరకు 619 టీఎంసీలు (74.45 శాతం) ఏపీ తరలించుకుపోయిందని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. తెలంగాణ కేవలం 212 టీఎంసీలు (25.55 శాతం) మాత్రమే ఉపయోగించుకుందని తెలిపారు. కామన్ రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్​ల నుంచి ఏపీ 38.72 టీఎంసీలు అదనంగా తరలించుకుపోయిందని, తెలంగాణకు ఇంకా 108.80 టీఎంసీల వాటా మిగిలి ఉందని వివరించారు. శ్రీశైలం, సాగర్​లో నిల్వ ఉన్న నీళ్లన్నీ తెలంగాణకే దక్కుతాయన్నారు. ఏపీ ఇకపై నీళ్లు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు ఒక టీఎంసీ నీటిని జల ఉత్పాదన ద్వారా తరలిస్తున్నదని, ఈ తరలింపును వెంటనే అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణనే కరెంట్ ఉత్పత్తి ద్వారా నీటిని తరలిస్తూ రిజర్వాయర్లలోని నీటిని వృథా చేస్తున్నదని, ఆ రాష్ట్రాన్నే కట్టడి చేయాలని ఏపీ ఈఎన్సీ లేఖలో కోరారు. ఈ రోజు సమావేశాన్ని వాయిదా వేసి ఏప్రిల్ మొదటి వారంలో మళ్లీ నిర్వహించాలని, అప్పుడు అన్ని అంశాలపై చర్చిద్దామని విజ్ఞప్తి చేశారు.