మీ ఓటర్ కార్డులో తప్పులున్నాయా...? వాటిని సవరించుకోవాలని చూస్తున్నారా.? అయితే దాన్ని మార్చుకునే ఛాన్స్ వచ్చింది. ఏపీలోని ఫొటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. కొత్తగా పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఇవి కూడా చదవండి: ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఈరోజు ( జూన్ 25) నుంచి ఓటర్ల జాబితాలో పేరు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తారన్నారు. జాబితాలో తప్పులుంటే ఇంటింటి తనిఖీల్లో సరిచేస్తామని అన్నారు. 2024 ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పది లక్షల ఓట్లను తొలగించినట్లు గతంలో ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఆ ఓట్ల తొలగింపుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని... వాటిని ఫేక్ ఓట్లుగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సవరణ చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.
