- ఏపీ పునర్విభజన చట్ట సవరణ
- బిల్లుపై లోక్‌సభలో చర్చ
- తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదని ఫైర్
- రైల్వే కేటాయింపులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటులో వివక్ష: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి: ఎంపీ మల్లు రవి
- తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం విస్మరించింది: ఎంపీ రఘురాంరెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీకి రాజధానిగా అమరావతి సరే గానీ.. తమ రాష్ట్ర సంగతేంటని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కేంద్ర సర్కారును నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం తెచ్చిన ‘అమరావతి చట్ట బద్ధత’ బిల్లుకు మద్దతిస్తున్నామని, అయితే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చట్టంలో పొందుపరిచిన బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు, తెలంగాణకు ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్, ఇతర హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో తెలంగాణకు నీళ్లు, నిధులు, ప్రాజెక్ట్ ల కేటాయింపులో చేస్తున్న అన్యాయాన్ని లోక్ సభ వేదికగా ప్రశ్నించారు.
బనకచర్ల – నల్లమల సాగర్ పేరుతో ఏపీకి అక్రమంగా తెలంగాణ నీళ్ల మళ్లింపు, రామగుండం నుంచి చివరి నిమిషంలో ఏపీకి సెమీకండక్టర్ ఫ్యాక్టరీ తరలింపుపై భగ్గుమన్నారు. రైల్వే ప్రాజెక్ట్‌లు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటులో తెలంగాణపై వివక్ష, ఏపీలో లేని ఎరువుల కొరత తెలంగాణలో సృష్టించడంపై ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026’ను బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి చర్చలో పాల్గొన్నారు. గత పదేండ్లుగా తెలంగాణకు బీజేపీ సర్కారు చేస్తున్న అన్యాయం, పక్షపాత వైఖరిని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణ హామీలు నెరవేర్చేందుకు
బిల్లు తీసుకురండి: మల్లు రవి
ఏపీ రాజధాని కోసం తెచ్చిన బిల్లు మాదిరిగానే.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సవరణ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. అమరావతి చట్ట బద్ధత బిల్లుకు మద్దతిస్తున్నామని, అయితే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఐఐఎం, బయ్యారం స్టీల్ ప్లాంట్, తెలంగాణలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, మరెన్నో హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. అమరావతి మాదిరిగానే.. తెలంగాణ హామీల పరిష్కారం కోసం సవరణ బిల్లు తీసుకురావడంలో తెలంగాణకు చెందిన మంత్రులు చొరవ చూపాలి’’ అని సభ ద్వారా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని మల్లు రవి కోరారు. ఇక తెలంగాణలో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేలా చొరవ చూపాలని ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమానయాన శాఖ మంత్రికి వినతి పత్రాలు సమర్పించినట్టు సభ దృష్టికి తెచ్చారు.
అందుకు కావాల్సిన భూమిని సైతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. కానీ..తెలంగాణ సర్కార్ ఎలాంటి విజ్ఞప్తులు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం సరికాదని అన్నారు.
రాష్ట్ర విభజన బ్లాక్ డే కాదు..
ఇరు రాష్ట్రాల అభివృద్ధికి గ్రేట్ డే: రఘురాంరెడ్డి అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లుతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు దక్కినందుకు ఆందోళన కూడా లేదని వ్యాఖ్యానించారు. అయితే, రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్), మూసీ పునర్జీవనం, ఇతర ప్రాజెక్ట్ లకోసం తెలంగాణ అడిగిన అదనపు నిధులు ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లు అడిగితే.. కేవలం కొత్తగూడేనికి మాత్రమే ఏర్పాటు ఇచ్చారన్నారు. అలాగే, అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్‌ను తిరిగి ఉనికిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. విభజన చట్టానికి చేసిన రెండో సవరణలో.. 4 గ్రామ పంచాయితీలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపారని గుర్తు చేశారు.
వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సభ ద్వారా కేంద్రానికి గుర్తు చేశారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యా సంస్థల బలోపేతం కోసం ఎన్ఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీ ఆధ్వర్యంలో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్‌కు మద్దతు, ఐటీ హబ్‌గా హైదరాబాద్ కు సహకారం, వెనకబడిన ప్రాంతాల కింద ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ కు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. సెక్షన్ 93 ప్రకారం.. బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను పున:రుద్ధరిస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఇచ్చారు.
నీళ్ల కేటాయింపుల కోసం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం, సెక్షన్ 94(2) ప్రకారం.. వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సహకారం, అలాగే రూరల్, అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన లాంటి హామీలు ఉన్నాయి” అని వివరించారు. మరి వీటిని పదేండ్లుగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన రోజును బ్లాక్ డేగా అభివర్ణించవద్దని ఏపీ ఎంపీలు, నేతలను ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. అది రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోయే గ్రేట్ డే అని తెలిపారు. విభజన ద్వారా ఇరు రాష్ట్రాలకు కేంద్ర నిధులు దక్కుతాయన్నారు. తెలంగాణకు విభజన హామీ ప్రకారం నిధులు దక్కాలని తాము చేస్తున్న పోరాటానికి ఏపీ నేతలు తమకు మద్దతు తెలపాలని కోరారు.
బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తే..కాంగ్రెస్ దోచుకుంటున్నది: కిషన్ రెడ్డి
పదేండ్ల పాలనలో తెలం గాణ అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం ఆర్ఆర్ ట్యాక్స్ పేరు తో.. తెలంగాణను దోచుకుంటున్నదని ఆరోపించారు. దీన్నుంచి తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ లక్ష్యాల సాధన జరగడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసేలా కాంగ్రెస్ పాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. ‘‘సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 1969లో తొలి దశ ఉద్యమంలో 369 మంది, చివరిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానం చేశారు. వారి త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది’’ అని గుర్తు చేశారు. ఏపీకి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తెచ్చామన్నారు. ఏపీలో 8 ఎయిర్‌పోర్ట్‌లు ఉంటే, తెలంగాణ లో కేవలం ఒక్క ఎయిర్ పోర్ట్ ఉండానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే అని విమర్శించారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో రైల్వే, నేషనల్ హైవేల అభివృద్ధి చేపట్టలేదని, విమానాశ్రయాలు ఇవ్వలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌ల నిర్మాణానికి భూమి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా.. భూములు ఇవ్వడం పక్కనపెడితే కనీసం స్పందించలేదని సభకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది కాబట్టే..
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో రైల్వేలు, జాతీయ రహదారులు, అన్నిరకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి రాజధానిగా ఏర్పాటవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఏపీ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నట్టు చెప్పారు.
తెలంగాణపై అన్నింటా వివక్ష: వంశీకృష్ణ
రైల్వే కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుచూస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఏపీకి వేల కోట్లు కేటాయిస్తున్న రైల్వే శాఖ.. తెలంగాణకు మాత్రం రూ.100 కోట్లు, ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులను ఇచ్చి మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. పూర్తి అన్యాయంగా ఇరు రాష్ట్రాల మధ్య రైల్వే కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రస్తుతం ఏపీలో ఏడు నుంచి తొమ్మిది ఎయిర్‌పోర్ట్ లు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉందని సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంలోనూ కేంద్రం పక్షపాతం చూపుతున్నదని విమర్శించారు. పెద్దపల్లికి కూడా ఎయిర్‌పోర్ట్ ఇవ్వాలని పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి కోరినట్టు చెప్పారు. ఈ అభ్యర్థనపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదని అన్నారు. ‘‘ఈ విషయాన్ని సభ్యులు గమనించాలి. ఎందుకు నీళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర అంశాల్లో అన్యాయం చేస్తుందో ఆలోచించాలి’’ అని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భద్రాచలం, కొత్తగూడెంలో ముంపు జలాలతో దాదాపు 2 లక్షల మంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ముంపు ప్రాంతంలో కరకట్ట కట్టి స్థానిక ప్రజల్ని కాపాడాలని సభ ద్వారా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా కేంద్ర మాజీ మంత్రి కాకా( జీ వెంకటస్వామి) తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎంతో మంది పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే.. ఆ మూడింటిని కేంద్రం అడ్డుకుంటున్నదని తెలిపారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకుండా.. ఏపీకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో సెమీకండక్టర్, నిధులు, నీళ్లు, రైల్వే ప్రాజెక్టులు మళ్లిస్తున్నదని అన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
విభజన సందర్భంలో ఏపీ నుంచి తెలంగాణ కు రావాల్సిన దాదాపు రూ. 20 వేల కోట్లు ఇప్పించాలని కోరారు. నీళ్ల విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల– నల్లమల సాగర్ విషయంలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌లు చర్యలు తీసుకోకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. దాదాపు లక్ష కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కుగా రావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీళ్లను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నదని చెప్పారు. దీనివల్ల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి నియోజక వర్గం కరువు ప్రాంతంగా మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ రికార్డ్‌లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. కేంద్రంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నందున ఏపీ సీఎం చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు తెలుపుతున్నట్టు కేంద్రం వైఖరి ఉందన్నారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ తన నియోజక వర్గంలోనే ఉన్నదని, అయినా తెలంగాణలో ఎరువుల కొరత వస్తున్నదని.. అదే ఏపీలో ఎలాంటి సమస్య లేదన్నారు.
